కశ్మీర్‌లో ఉద్రిక్తత

– భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన ఆందోళన కారులు

– అడ్డుకొనేందుకు కాల్పులు జరిపిన భద్రతా సిబ్బంది

– ముగ్గురు పౌరులు మృతి, మరో పదిమందికి గాయాలు

శ్రీనగర్‌,జులై7(జ‌నం సాక్షి): జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో చెలరేగిన అల్లర్లు ఉద్రిక్తంగా మారాయి. కుల్గాంలో భద్రతా బలగాలు గస్తీ నిర్వహిస్తున్న సమయంలో పలువురు ఆందోళనకారులు వారిపై రాళ్ల దాడికి దిగారు. దీంతో ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలోనే రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరికి బుల్లెట్‌ గాయాలయ్యాయని.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.మృతులను షకీర్‌ అహ్మద్‌(22), ఇర్షాద్‌ మజిద్‌(20), 16ఏళ్ల యువతి అంద్లేబ్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణల్లో గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ముందస్తు చర్యల్లో భాగంగా కుల్గాం, అనంత్‌నాగ్‌ జిల్లాలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హన్‌ వనీ రెండో వర్ధంతి సందర్భంగా కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగకుండా పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, నౌహట్టా, మైసుమా పరిధిలో ఈ ఆంక్షలుఅమల్లో ఉన్నాయి.