కశ్మీర్‌లో నలుగురు ముష్కరులు హతం

ఎదురుకాల్పుల్లో పోలీసు, పౌరుడి మృతి

కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసిన అధికారులు

శ్రీనగర్‌, జూన్‌22(జ‌నం సాక్షి ) : జమ్ముకశ్మీర్‌లో సైన్యం ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగిస్తోంది. రాష్ట్రంలోని అనంతనాగ్‌ జిల్లాలో శుక్రవారం నలుగురు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీసు, ఓ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు ఇస్లామిక్‌ స్టేట్‌ జమ్ముకశ్మీర్‌(ఐఎస్‌జేకే) సంస్థకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఐఎస్‌జేకే చీఫ్‌ దావూద్‌ కూడా ఉన్నట్లు డీజీపీ ఎస్‌ పీ వైద్‌ వెల్లడించారు. అనంతనాగ్‌లోని శ్రీగుఫ్‌వరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పోలీసులు తిప్పికొట్టేందుకు ఎదురుకాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా సిబ్బందిపైకి స్థానిక యువకులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిపారు. హతమైనవారిలో మోస్ట్‌ వాంటెడ్‌ తీవ్రవాది ఖాసీమ్‌ కూడా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అనంత్‌నాగ్‌, శ్రీనగర్‌లో ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన భదత్రాదళాలపై అల్లరి మూకలు రాళ్లదాడికి పాల్పడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. రాళ్లదాడులకు పాల్పడిన వారినినిలువరించడానికి సైన్యం అదనపు బలగాలను ఉపయోగించింది. ఈ సమయంలో కొంత మంది పౌరులు గాయపడినట్టు తెలుస్తోంది. రంజాన్‌ సందర్భంగా తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను కేంద్రం నిలిపివేయడంతో గతంలో ఎన్నడూలేని విధంగా కశ్మీర్‌లో ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. పండుగ రోజు సైతం ఉగ్రమూకలు దాడులకు పాల్పడటంతో ఈద్‌ ముగిసిన మర్నాడే కాల్పుల విరమణ నిలిచిపోయినట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో నెల రోజుల పాటు ఎంతో సంయమనంతో ఉన్న సైన్యం ఉగ్రవాదుల వేటను తిరిగి ఆరంభించింది. మంగళవారం నాడు పుల్వామాలో ముగ్గురు జైషే మహ్మద్‌ తీవ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చింది. పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో జమ్మూ కశ్మీర్‌లో పాలన గవర్నర్‌ చేతిలోకి వెళ్లింది. గరవ్నర్‌ పాలనలోకి వెళ్లిన రెండు రోజుల్లోనే ఆర్మీ ఉగ్రవాదనులపై విరుచుకుపడింది.