కశ్మీర్‌ అంశంపై మళ్లీ నోరుపారేసుకున్న పాక్‌

శ్రీనగర్‌, మే9(జ‌నం సాక్షి) : కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌ మరోసారి నోరు పారేసుకుంది. అమాయక కశ్మీర్‌ యువతను ఉగ్రవాదం పేరుతో క్రూరంగా కాల్చి చంపుతున్నారని మొసలి కన్నీరు కార్చింది. రెండురోజుల క్రితం సోఫియాన్‌ జిల్లాలో ఐదుగురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్పి చంపాయి. ఈ సందర్భంగా రాళ్లు రువ్విన స్థానికులను చెదరగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సుదీర్ఘ కాలంగా కశ్మీర్‌ లోయలో భారత్‌ సాగిస్తున్న మారణకాండలో ఇదో చీకటి అధ్యాయం ఇది అంటూ పాక్‌ విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. చట్టబద్ధంగా స్వీయాధికారం కోసం స్థానిక కశ్మీరీ యువత చేస్తున్న పోరాటాన్ని ఉగ్రవాదంగా ప్రచారం చేయడంలో భారత్‌ విజయం సాధించలేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. పొరుగుదేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న ఇంగితం లేకుండా కశ్మీరీల పోరాటానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని నిస్సిగ్గుగా చెప్పుకొచ్చింది. భారత ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న క్రూరమైన అణచివేత చర్యలు, మానవహక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని విజ్ఞప్తి చేసింది. ఐరాస భద్రతా మండలి తీర్మానం ఆధారంగా కశ్మీర్‌ వివాదాన్ని పరిష్కరించాలని పాక్‌ విదేశాంగ శాఖ ఈ ప్రకటనలో పేర్కొంది.