కశ్మీర్‌ భారత్‌లో భాగం.. 

– దీన్ని ఎవ్వరూ మార్చలేరు
– ఐరాసలోని భారత కార్యదర్శి సందీప్‌ కుమార్‌
ఐరాజ్య సమితి, జూన్‌26(జ‌నం సాక్షి) : జమ్ముకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని, దాన్ని ఎవ్వరూ విడదీయలేరని ఐరాసలోని భారత కార్యదర్శి సందీప్‌ కుమార్‌ అన్నారు. ఐరాసలో పాకిస్థాన్‌ రాయబారి జమ్ముకశ్మీర్‌ అంశం లేవనెత్తిన నేపథ్యంలో భారత్‌ స్పందించింది. సోమవారం జరిగిన ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ‘యుద్ధ నేరాలు, ఊచకోతలు, మతపరమైన హత్యలు, మానవత్వంపై అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత’ అనే అంశంపై చర్చ జరుగుతుండగా ఐరాసలోని పాక్‌ రాయబారి మలీహా లోధి మాట్లాడుతూ..కశ్మీర్‌ ప్రజలు విపరీతమైన నేరాలకు బాధితులుగా మారుతున్నారని పేర్కొన్నారు. దీనిపై భారత్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. పాక్‌ వ్యాఖ్యలకు సమాధానమిచ్చే హక్కును ఉపయోగించుకుని దీటుగా బదులిచ్చింది. ఆధారం లేని మాటలు మాట్లాడడం వల్ల పాకిస్థాన్‌ నిజాలను మార్చలేదని, భారత్‌ నుంచి విడదీయలేని భాగం కశ్మీర్‌ అని.. అందులో ఎలాంటి మార్పు ఉండదని ఐరాసలోని భారత కార్యదర్శి సందీప్‌ కుమార్‌ బయ్యపు వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌ విషయంలో అనవసరమైన వ్యాఖ్యలు చేసేందుకు ఈ వేదికను పాక్‌ దుర్వినియోగం చేస్తోందని ఆయన విమర్శలు చేశారు.