కాంగ్రెస్సే లక్ష్యం..
రాహుల్‌కు ఓట్లు, సీట్లే లెక్క సడక్ బంద్ విజయవంతానికి
రెండు రోజుల బస్సుయాత్ర : కోదండరామ్
హైదరాబాద్, ఫిబ్రవరి9 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలంటే కాంగ్రెస్సే లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగించాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహిం చిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సడక్ బంద్ విజయవంతం చేయడానికి ఈనెల 11, 12 తేదీల్లో ఐకాస బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సడక్‌బంద్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐకాసలో నాగం జనార్దనరెడ్డి చేరిక చాలా చిన్న సమస్య అని, ఐకాసలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. విజయవాడ రహదారి దిగ్బంధంపై స్పష్టమైన తేదీ త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఈనెల 24న కర్నూలు జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఇక రాజకీయ పోరు తీవ్రం చేస్తామని, కాంగ్రెస్ మంత్రులే ప్రధాన టార్గెట్ అని అన్నారు. ఈనెల16 నుంచి 21వ తేదీ వరకు కాగ్రెస్ నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన అన్నారు. ఈనెల 24న సడక్ బంద్ కార్యక్రమానికి జాతరలా కదిలి రావాలని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెసు కండువాలు వేసుకోవడానికి సిగ్గుపడేలా ఉద్యమం చేయాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల్లో స్వార్థం పెరిగిందని, మానవత్వం నశించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఓట్లు, సీట్ల లెక్కలే తప్ప సమస్యలు పరిష్కరించే ఉద్దేశం లేదని ఆయన విమర్శించారు. ఉద్యమాలు ఎలా చేయాలో చెప్తే అలా చేస్తామని, కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన తెలంగాణ యువతను కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు వినిపించడం లేదని ఆయన అన్నారు. సమష్టి ప్రయోజనాల కోసం పోరాడాలని అంటుంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు స్వప్రయోజనాలు చూసుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ఆంధ్ర నాయకుల పైసల మూటల గలగలలే కనిపిస్తున్నా గానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష వినిపించడం లేదని వ్యాఖ్యానించారు.