కాంగ్రెస్‌కి వస్తున్న ఆదరణ చూసి.. టీఆర్‌ఎస్ భయపడుతోంది
– ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్‌నేతలపై కేసులు పెడుతున్నారు
– పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్
కరీంనగర్, సెప్టెంబర్28 (జనంసాక్షి ) : కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి టీఆర్‌ఎస్ భయపడుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారని అన్నారు. జరగబోయే ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. ప్రజలు ధర్మంవైపే నిలబడాలని పొన్నం పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ వేధింపులకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడొద్దని అన్నారు. ఏకగ్రీవ తీర్మానాల సంస్కృతి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని ఆయన విమర్శించారు. గవర్నర్ నరసింహన్ కేసీఆర్‌కు తొత్తుగా మారారని, అబద్ధాల అంబాసిడర్‌గా అవతారం ఎత్తారని పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగేళ్ల పాలనలో తెరాస ప్రభుత్వం ప్రజలు చేసింది ఏవిూల లేదని అన్నారు. కేవలం మాటల గారడి చేసి కేసీఆర్ ప్రజలను మాయ చేస్తున్నారని విమర్శించారు. రోజుకో పథకం ప్రకటించిన కేసీఆర్ అవి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని తెలిపారు. రైతులను రాజులు చేస్తామని చెబుతున్న కేసీఆర్.. కనీస గిట్టుబాటు ధరలు లేక రైతులు లబోదిబోమంటున్నా పట్టించుకోలేదని, ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని అన్నారు. ప్రజలు కేసీఆర్ తీరును గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో సరియైన రీతిలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పోన్నం పేర్కొన్నారు.