కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతు పథకాలకు మంగళం
అన్ని కార్యాక్రమాలు ఆగిపోతాయన్న మాజీ ఎమ్మెల్యే
సిద్దిపేట,నవంబర్1(జనంసాక్షి): మహాకూటమికి అధికారం కట్టబెడితే మొట్ట మొదట నష్టపోయేది రైతులేనని
దుబ్బాక టిఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు ఆగిపోతాయని హెచ్చరించారు. కూటమి నేతలను నమ్మవద్దన్నారు. ఇక్కడి నీళ్లను మళ్ళీ యథేచ్ఛగా ఆంధ్రకు దోచుకొనిపోతారని తెలిపారు. గురువారం ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు టిఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాకూటమికి అధికారం కట్టబెడితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో పెట్టినట్లేనని అన్నారు. దీంతో మొట్ట మొదట నష్టపోయేది రైతులే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రూ.2లక్షల రైతుల రుణమాఫి హావిూ ప్రజలను మోసం చేయడం కోసమే అని అన్నారు. మహాకూటమి దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతుందని, టికెట్ల కోసం కాంగ్రెస్ ఢిల్లీ, టీడీపీ అమరావతి చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కోదండరాం, చాడ వెంకట్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికాకారంలోకి రాగానే ఓకే విడతలో రైతులకు లక్ష రూపాయలను మాఫి చేస్తామని హావిూ ఇచ్చారు. కేసీఆర్ వైద్య పరీక్షల కోసం ఢిల్లీకి పోతే.. ప్రధాన మంత్రిని కలిశారని ఉత్తమ్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోడీ విదేశ పర్యటనలో ఉన్నారని, అలాంటప్పుడు ఎలా కలుస్తారని ఆయన ప్రశ్నించారు. రైతుబంధుకు సంబంధించిన డబ్బులు రైతులకే అందుతాయని, అప్పులు కింద జమ కావని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా.. తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి అని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ టిఆర్‌ఎస్‌కు ఓటేయాలన్నారు. గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు ఇంటింటికీ తిరుగుతూ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కారు గుర్తుకు విూ ఓటు వేసి అత్యధిక ఓట్ల భారీమెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలను వంచించి అభివృద్ది చేయక తమ స్వలాభాలకు పాల్పడిన మహా కూటమి నాయకులకు ప్రజలు ఓటుతో తగిన బుద్ది చెప్పాలని కోరారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ద్రోహి ఆంధ్ర సీఎం చంద్రబాబుతో కాంగ్రెసు పార్టీ కుమ్మక్కు అయ్యి మళ్లీ తెలంగాణలోకి చంద్రబాబును కాంగ్రెసు పార్టీ తీసుక రావడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.



