కాంగ్రెస్‌కు ముందస్తు షాక్‌

త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పేలా లేదు. ఇద్దరు టిడిపి అభ్యర్తుల మద్దతుతో 19మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సీటును దక్కించుకోవాలని చూసింది. కానీ కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, టిడిపి నుంచి ఒకరు టిఆర్‌ఎస్‌లోకి జంప్‌ కానుండడంతో ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డిని ముందే ఓటమి పలకరించనుంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఆరుగురు పోటీ పడుతున్నారు. మిత్రపక్షమైన ఎంఐఎంతో కలిసి అన్ని స్థానాలను గెలుపొందేలా కేసీఆర్‌ పావులు కదుపు తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న బలం దృష్ట్యా ఒక్క స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఆ స్థానాన్ని కూడా చేజిక్కించుకునేందుకు కేసీఆర్‌ సిద్ధమయ్యారు. తెరాస బలపరచిన అభ్యర్థి విజయం సాధించాలంటే ఇద్దరు ఎమ్మెల్యేలు కీలకం కానున్న నేపథ్యంలో ఆత్రం సక్కుతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే రేగా కాంతారావులకు తెరాస నాయకత్వం గాలం వేసి పార్టీలో చేర్చుకుంటున్నట్లు తెలిసింది. అలాగే టిడిపికి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా పార్టీలో చేరనున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల చేరిక ద్వారా కాంగ్రెస్‌ను దెబ్బతీయడంతో పాటు శాసన మండలిలో తెరాస బలం పుంజుకోవడానికి వ్యూహాత్మకంగా వీరిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది.  టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన చెప్పారు.  సత్తుపల్లి నియోజకవర్గంలో తన వెన్నంటి ఉన్న నేతలు, కార్యకర్తలను సంప్రదించిన తర్వాత టీఆర్‌ఎస్‌లో ఎప్పుడు చేరేది నిర్ణయం జరుగుతుందని సండ్ర చెప్పారు. ఇకపోతే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నుంచి ఒకే ఒక్కడుగా విజయం సాధించిన ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఎట్టకేలకు తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి కోవ లక్ష్మిపై కేవలం 171 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన ఆత్రం సక్కు తెరాస పార్టీలో చేరతారన్న ఊహగానాలు నిజమయ్యాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రెండుమూడుసార్లు పార్టీలో చేరికపై మంతనాలు జరిపిన సక్కు తన రాజకీయ భవిష్యత్తు వ్యూహం మేరకు అధికార తెరాసలో చేరకకే మొగ్గుచూపినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావుకు అత్యంత విధేయుడిగా పేరున్న ఆత్రం సక్కుకు ఇటీవలే కాంగ్రెస్‌ అధిష్ఠానం డీసీసీ పగ్గాలు కూడా అప్పజెప్పింది. తెరాసలో చేరిక లాంఛనమే అయినప్పటికీ ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఆదివాసీ ఎమ్మెల్యేతో కలిసి అధికారపార్టీలో చేరుతున్నట్లు తెలిసింది. సక్కు పార్టీ మారితే ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా మారనుంది.  2009 ఎన్నికల్లోనూ ఆసిఫాబాద్‌ నుంచి నిలిచిన ఆత్రం సక్కు కాంగ్రెస్‌ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసినా.. కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సక్కుకే టికెట్‌ ఇచ్చింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా సక్కు మాత్రమే విజయం సాధించగా.. మిగిలిన అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. ఎట్టకేలకు ఆయన తెరాసలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గిరిజన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి కారణంగా, తుమ్మిడిహట్టి వద్ద ఆకట్ట నిర్మించి జిల్లాలో సాగునీటి కల్పనకు కృషి చేస్తున్నందువల్లే తెరాసలో చేరాలని నిర్ణయించు కున్నట్టు పేర్కొన్నారు. ఆయన చేరికతో జిల్లాలోని తెరాస ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది. గత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ముథోల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి విజయం సాధించిన విఠల్‌రెడ్డి తెరాస గూటికే చేరారు.
బీఎస్పీ నుంచి విజయం సాధించిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్పలు కూడా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జిల్లాలో పదికి పదిమంది ఎమ్మెల్యేలు తెరాసకు చెందినవారే. ఈ అయిదేళ్లపాటు కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో తెరాసదే హవా కొనసాగనుంది. మొత్తంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన అధినేత కెసిఆర్‌ రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఓ గట్టి సందేశాన్ని ఇచ్చారు. గులాబీకి తిరుగులేదని నిరూపించారు. తాను అనుకున్న 16 ఎంపి సీట్ల టార్గెట్‌ దిశగా పావులు కదుపుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నాటికి మరింత దిమ్మతిరిగేలా కార్యాచరణ ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు వచ్చి చేరితే చేసేదేముందని గతంలోను కెసిఆర్‌ ప్రకటించారు.
తెలంగాణలో శాసనసభ్యుల కోటాలో శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలను చేజిక్కించుకునేందుకు తెరాస అధిష్ఠానం పావులు కదుపుతున్న తీరే ఇందుకు నిదర్శనం. ఎన్నికలకు ముందే అందుకు అవసరమైన మద్దతును కూడగట్టుకోవాలని భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహ రచనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాలోచనలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు జరుగుతున్న శాసనమండలి ఎన్నికలను సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. నాలుగు స్థానాలు తాము తీసుకుని, ఒక స్థానాన్ని మజ్లిస్‌కు కేటాయించారు. మొత్తంగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుస్తామని, కాంగ్రెస్‌ నుంచి పోటీ ఉండదని తొలుత తెరాస అధిష్ఠానం అంచనా వేసింది. అందుకు భిన్నంగా కాంగ్రెస్‌ బరిలోకి దిగడంతో అప్రమత్తమైంది. ఐదు స్థానాలు గెలుచుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని సిద్ధం చేయడంలో భాగంగా కాంగ్రెస్‌,టిడిపి ఎ/-మెల్యేలను బుటట్టలో వేసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్‌కు మరోమారు భంగపాటు తప్పలేదు.