కాంగ్రెస్ ఎస్సీ సెల్ విభాగం పటిష్టతకు చర్యలు ఎస్సీ సెల్ అధ్యక్షుడు
కాకినాడ, జూలై 13, ): తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ సెల్‌ను ప్రతి మండలంలో పటిష్ట పరచడానికి చర్యలు చేపడుతున్నట్టు జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వర్ధనపు వీర్రాజు తెలియజేశారు.ఇప్పటికే ప్రతి మండలంలో అడహక్ కమిటీలు వేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన జిల్లాలో మొత్తం జనాభా 53లక్షల మంది ఉంటే అందులో 10లక్షలకు పైగా ఎస్సీలు ఉన్నారని వారి సంక్షేమం కోసం కాంగ్రెస్‌పార్టీ ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. ఇటువంటి కాంగ్రెస్‌పార్టీని ప్రతి ఎన్నికల్లోనూ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ సంక్షేమ కార్యక్రమాలు లబ్దిదారులకు అందకుండా కొంత మంది బ్రోకర్లు అడ్డుపడుతున్నారని వారి ఆగడాలను శాశ్వతంగా అరికట్టేందుకు కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యకర్తలు సైనికుల్లా కృషి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 25 మండలాల్లో కమిటీలు వేయడం జరిగిందని మిగిలిన మండలాల్లో కమిటీలు వేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో పర్యటనలు జరిపి కాంగ్రెస్ ఎస్సీ సెల్‌ను పటిష్ట పరుస్తున్నామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ప్రజాప్రతినిధులను రాష్ట్రంలోనే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా నుండి పంపించడానికి నాయకత్వ పటిమ గల వారి కోసం టాలెంట్ సెర్చ్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తున్నామని వర్ధనపు వీర్రాజు వివరించారు.