కాంగ్రెస్ ట్రంప్ కార్డు ప్రియాంక
మరోమారు అధికారం దక్కించుకునే క్రమంలో ప్రధాని మోడీ వేస్తున్న ఎత్తులకు కాంగ్రెస్ పై ఎత్తులు వేస్తోంది. ఇటీవల బిజెపి నుంచి మూడు రాష్ట్రాలు హస్తగతం కావడంతో కాంగ్రెస్‌లో భరోసా పెరిగింది. రాహుల్ నాయకత్వంపై దేశవ్యాప్తంగా కూడా నమ్మిక ఏర్పడింది. రాహుల్‌ను కాంగ్రెస్ శ్రేణులు భావి ప్రధానిగా భావిస్తున్నారు. ఈ దశలో రాఫెల్ డీల్‌పై పట్టువదలని విక్రమార్కుడిలా రాహుల్ పోరాటం చేస్తున్నారు. ఈ డీల్‌లో ప్రధాని మోడీ నేరుగా దోషి అన్న లెవల్ వరకు ప్రచారం తీసుకుని వెళ్లారు. ఎందుకంటే అంబానికి డీల్ కట్టబెట్టడంపై ఇంతవరకు సమాధానం రాలేదు. ఇకపోతే బిజెపిలో కూడా మోడీ తీరుపై అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. మోడీ,అమిత్‌షాలు పార్టీని తమగుప్పిట్లో పెట్టుకుని ఆడిందే ఆటగా సాగిస్తున్నారన్న ఆందోళన నెలకొంది. రాఫెల్ డీల్, నోట్ల రద్దు, జిఎస్టీ దేశ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపినా వీటిపై ప్రధాని మోడీ నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. రాఫెల్‌పై దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుని ప్రశ్నలు సంధించిన సమయంలో మోడీ దానికి విరుగుడుగా అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకుని వచ్చారు. ఎన్నికల ముందు నిజంగానే ఇది తీవ్ర ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఈ దశలో ఇక కాంగ్రెస్ మరో ట్రంప్ కార్డు కోసం పాచిక వేసింది. ఇంతకాలం కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయిన ప్రియాంకను ఇక నేరుగా ప్రతక్ష్యక్ష రాజకీయాల్లోకి దింపడం ద్వారా మోడీని ఢీకొనాలని రాహుల్ ఎత్తుగడ వేశారు. ప్రియాంక గాంధీ ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తారా, రారా? అన్న ప్రశ్న మెదులుతూనే ఉంది. కొడుకు కోసం సోనియా అడ్డుపడుతున్నదన్న ప్రశ్నలు ఇంతకాలం వేధిస్తూ వచ్చాయి. అచ్చం ఇందిరమ్మలాగా ఉండే ప్రియాంక వస్తేనే కాంగ్రెస్ బతికిబట్టకట్టడం సాధ్యమని భావిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు అధికంగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీని ఓడించడం సాధ్యం కాధన్న భావనలో వీరు ఉన్నారు. మూడు రాష్ట్రాలు బిజెపి నుంచి కాంగ్రెస్ వశం చేసుకున్నా ఎందుకనో మోడీని ఓడించడం సాధ్యం కాదన్న భయం వారిని వెన్నాడుతూనే ఉంది. దీనికితోడు పదిశాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ఆశలపైనీళ్లు చల్లాయి. ఈ దశలో ఇక ప్రియాంక మాత్రమే కాంగ్రెస్‌ను బతికిస్తుందని అని ఇంతకాలం నమ్ముకున్న కాంగ్రెస్ అభిమానులకు ప్రియాంక రాజకీయరంగ ప్రవేశం రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. ఇంతకాలం కుటుంబపరంగా అమ్మ, అన్నల విజయం కోసం అమెథీలోనూ, రాయ్‌బెరిల్లీలోనూ ప్రచారం చేస్తూ వచ్చిన ప్రియాంక, పార్టీ కోసం పనిచేయలేదు. ప్రియాంక ఇప్పుడు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ¬దాలో తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు స్వీకరించడంతో ఆమె రాజకీయ ప్రవేశం అధికారికంగా జరిగిపోయింది. ఇది మోదీపై రాహుల్ సర్జికల్ దాడి అనీ, రాజకీయ బ్రహ్మాస్త్రమనీ చాలామంది భావిస్తున్నారు. ప్రియాంకను అకస్మాత్తుగా తెరవిూదకు తేవడంతో బీజేపీ వణికిపోతున్నదని రాహుల్ కూడా అంటున్నారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిగంటల్లోనే ప్రధాని మోదీ కాంగ్రెస్ వంశపారంపర్య పాలనపై మరోమారు విరుచుకుపడ్డారు. మొత్తంగా రాజకీయ ఎత్తుగడలు సాగుతున్నాయనే చెప్పాలి. ప్రియాంక ప్రభావం ఉత్తర్‌ప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాబోదనీ, దేశమంతటా కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ఉపకరిస్తుందని కాంగ్రెస్ నాయకులు సంతోషిస్తున్నారు. దీనికితోడు యూపిలో ఒంటరి పోరు చేయాల్సిన ఆగత్యం కాంగ్రెస్‌కు ఏర్పడింది. ఎస్పీ,బిఎస్పీ జట్టుకట్టడంతో యూపిలో అత్యధిక ఎంపిలు సాధించడం కాంగ్రెస్‌కు కష్టం కానుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 71స్థానాలు సాధించి కేంద్రంలో సులభంగా అధికారంలోకి వచ్చింది. గతంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న యూపీని క్రమంగా ఎస్పీ, బీఎస్పీలు, బీజేపీ ఆక్రమించడంతో దశాబ్దాలుగా ఈ పార్టీకి అక్కడ ఉనికి లేకుండా పోయింది.
దీనికితోడు, ఇటీవల ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఒక్కటై బీజేపీపై పోరాడాలన్న ప్రతిపాదన వెనక్కి పోయింది. సార్వత్రక ఎన్నికల్లో హస్తినలో పాగా వేయాలంటే 80స్థానాలున్న యూపీ అత్యంత కీలకం. పార్టీ యావత్తూ నిస్తేజంగా, నిరాసక్తంగా ఉన్న ఈ స్థితిలో ప్రియాంక ప్రవేశం పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహన్ని ఇచ్చింది. మోదీ హవాతో యూపీలో బీజేపీ పరిస్థితి ఒక్కసారిగా మారినట్టు, ప్రియాంక రాక కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేరుస్తుందని ఆశిస్తున్నారు. పేరుకు యూపికి ప్రియాంకను పరిమితం చేస్తారని అనుకోవడానికి లేదు. ఆమెను కీలకమైన అన్ని ప్రాంతాల్లో ప్రచారానికి ఉపయోగించడం ఖాయం. మోదీ, యోగి సహా కేంద్రక్యాబినెట్‌లోని అనేకమంది మంత్రులు గెలుచుకొస్తున్న తూర్పు యూపీని స్వాధీనం చేసుకోవడం, తద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలను దెబ్బతీయడం కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం. సగం స్థానాలున్న తూర్పు ప్రాంతంలో ఒకప్పుడు కాంగ్రెస్ పక్షాన నిలిచి, ఇప్పుడు బీజేపీ ఓటుబ్యాంకుగా మారిన అగ్రకులాలవారిని తిరిగి మెప్పించి రప్పించే బాధ్యత ప్రియాంక తీసుకోవాల్సి ఉంటుంది. మోదీ పదిశాతం రిజర్వేషన్ల అస్త్రం తరువాత ప్రియాంకను బ్రహాస్త్రంగా ప్రయోగించడం తప్ప కాంగ్రెస్‌కు మరోదారి లేకపోయింది. అయితే ఆమె ఏ మేరకు కాంగ్రెస్‌కు తురుపుముక్కగా పనికి వస్తారన్నది ఎన్నికల ప్రచారం, సరళి, ఫలితాలను బట్టి తేటతెల్లం కానుంది. యూపీలో చెప్పుకోదగ్గ నాయకత్వం లేని కాంగ్రెస్‌కు ఇప్పుడు ప్రియాంక రాకతో ఆ కొరత మాత్ర తీరుతుంది.