కాంగ్రెస్ దుష్పచ్రారాలు నమ్మొద్దు
– బాబు మేధావైతే 24గంటల విద్యుత్ ఎందుకివ్వలేదు?
– తెరాస ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుంది
– ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం
– కూటమికి అవకాశమిస్తే రాష్ట్రం అంధకారమే
– ప్రజాకూటమికి ఓటుతో బుద్ది చెప్పండి
– బాల్కొండ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
నిజామాబాద్, నవంబర్26(జనంసాక్షి) : ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ దుష్పచ్రారాలను నమ్మొద్దని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు సీఎం కేసీఆర్. 55 ఏళ్ల పాటు సాగిన కాంగ్రెస్, టీడీపీ పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. 24గంటల కరెంట్, పెన్షన్లు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉన్నాయో విూకు తెలుసునని, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి వంటి పథకాలు గతంలో చూశామా అని ప్రశ్నించారు. భూమి దున్నుకున్న రైతుల నుంచి గత ప్రభుత్వాలు నీటి తీరువా వసూలు చేస్తే.. మేం రద్దు చేశామన్నారు. పైసాఖర్చు లేకుండా పాసుపుస్తకాలు ఇచ్చి, సాగుకు పెట్టుబడి కూడా ఇచ్చామన్నారు. గత మేనిఫెస్టోలో లేకపోయినా.. బీడీ కార్మికులు, బోదకాల బాధితులకు పెన్షన్లు ఇస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి విూ కండ్ల ముందే ఉందని, ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటేయ్యాలన్నారు. చంద్రబాబు పెద్ద మేధావి అయితే 24గంటల కరెంట్, ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ నాలుగు మూలాలు తిరిగానని, ఎక్కడ పోయినా టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రభంజనంలా ఉందన్నారు. నిజాం సాగర్‌కు నీరు రాకపోతే సింగూర్ నుంచి నీరు విడుదల చేసి పంటలకు నీరు ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. నిజాం సాగర్ కింద పంటలు పండాలని, నీళ్ల విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేయడం తగదన్నారు. వనరులను వాడుకోని నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ దుష్పచ్రారాలు నమ్మొద్ద న్నారు. బాల్కొండ నియోజకవర్గానికి లక్షాపది
వేల ఎకరాలకు నీళ్లిస్తామని, ఎగువన మహారాష్ట్ర వాళ్లు ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ వాళ్లు చూస్తూ కూర్చున్నారన్నారు. రైతులను అన్ని విధాలా కాపాడుకుంటామని, భీమ్‌గల్‌లో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. బాల్కొండకు డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తానని, జూన్ తర్వాత ఎస్సారెస్పీ నిండు కుండలా మారబోతుందని, నిజామాబాద్‌లో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం కేంద్రంపై పోరాడుతున్నామన్నారు. ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని, మహిళా సంఘాలకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను అప్పగిస్తామని తెలిపారు. మన వద్ద పండించే పసుపు ఇతర రాష్ట్రాలకు పోతోందని, కల్తీ ప్యాకెట్లు మనకు వస్తున్నాయని, ఇలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు.