కాంగ్రెస్‌ పాలన నుంచి కర్ణాటక ప్రజలకు త్వరలో విముక్తి 

– ఐదేళ్లలో కర్ణాటకను భ్రష్టు పట్టించారు
– రాష్ట్రానికి పనిమంతులను తీసుకురండి
– కాంగ్రెస్‌ పార్టీ అహంకార పార్టీ
– అందుకే ముందుగానే తాను ప్రధాని అని రాహుల్‌ ప్రకటించుకుంటున్నాడు
– కాంగ్రెస్‌ రిమోట్‌ కంట్రోల్‌ సోనియా దగ్గరుంటుంది
– భాజపా రిమోట్‌ ప్రజల చేతుల్లో ఉంటుంది
– వారు చెప్పినట్లే తన పనివిధానం ఉంటుంది
– కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ
బెంగళూరు, మే9(జ‌నం సాక్షి) : త్వరలో కాంగ్రెస్‌ పాలన నుంచి కర్ణాటక ప్రజలకు విముక్తి కలగనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం బంగారుపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ తాము అభివృద్ధి ప్రాతిపదికనే ఓట్లు అడుగుతున్నామన్నారు. కాంగ్రెస్‌ను ఆరు రోగాలు పట్టి పీడిస్తున్నాయని ప్రధాని విమర్శించారు. కులతత్వ రాజకీయాలు, అవినీతి, మతతత్వ, నేరపూరిత రాజకీయాలకు కాంగ్రెస్‌ మారుపేరని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటును సాగనివ్వకుండా అడ్డుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని మోదీ దుయ్యబట్టారు. ఒకప్పుడు గ్రామ పంచాయతీ మొదలు పార్లమెంటు దాకా కాంగ్రెస్‌ జెండా ఎగురుతూ కనిపించేదనీ.. అయితే ప్రజలు ఆ పార్టీని తిరస్కరిచడంతో అధికారం పీఠం నుంచి పడిపోయిందన్నారు. ఓటమిని అంగీకరించడం చేతగాకే పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కల్పించారని ప్రధాని విమర్శించారు. కాంట్రాక్టు డీలర్ల సౌకర్యం కోసమే కాంగ్రెస్‌ పనిచేస్తుందన్నారు. కర్ణాటక రాష్ట్రం దేశానికే గర్వకారణమనీ.. గత ఐదేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రం ప్రతిష్టను దారుణంగా కాంగ్రెస్‌ విభజన రాజకీయాలతో కర్ణాటక ప్రజలు విసిగి పోయారు. ఐదేళ్లలో కర్ణాటకను భ్రష్టు పట్టించారన్నారు. భారతీయులందరూ నా సంరక్షణలో ఉన్నారని, కానీ అందులో కర్ణాటక ప్రజలు మాత్రం ప్రమాదం అంచుల్లో ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర గౌరవాన్ని కాంగ్రెస్‌ మంటగలిపిందని,. మాటలు చెప్పి కాలం గడిపే వారిని సాగనంపండన్నారు. రాష్ట్రానికి పనిమంతులను తీసుకురండంటూ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తాయని, మంచి పాలకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని సూచించారు. కాబోయే ప్రధానిని నేనే అని తనకు తానుగా రాహుల్‌ గాంధీ ప్రకటించుకున్నారని, దీన్నిబట్టి ఆయన ఎంతటి గర్విష్టో అర్థమవుతోందని, కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న
వారందరూ అహంకారులేనని ప్రధాని విమర్శించారు. వారిది అహంకార పార్టీ, గర్వంగానే మాట్లాడతారని అన్నారు. వాళ్లకు ప్రజల సమస్యలను పట్టించుకునే మనసు లేదని, మన్మోహన్‌ సింగ్‌ పేరుకు మాత్రమే ప్రధాని అని, కానీ ఆయన తన పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేసేవారన్నారు. వీళ్లందరికీ సోనియాగాంధీ సారథిగా వ్యవహరించేవారని, కాంగ్రెస్‌ రిమోట్‌ కంట్రోల్‌ సోనియా దగ్గర ఉందన్నారు. కానీ భాజపా రిమోట్‌ 125కోట్ల భారత ప్రజల చేతిలో ఉందని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలే నాకు హైకమాండ్‌ అని, వారు చెప్పిందే నేను వింటానన్నారు. మరో మూడురోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో ప్రచార గడువు ముగియనుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ ఫలితాలు మే 15న వెలువడనున్నాయి.
———————————-