కాంగ్రెస్‌ వస్తే.. జనరేటర్లు కొనుక్కోవాల్సిందే

 

– రాష్ట్రాన్ని అంధకారంగా మార్చేస్తారు

– నాలుగేళ్ల పడిన శ్రమ వృథా అవుతుంది

– ఎన్నికల వేళ ఊరిలో లిక్కర్‌ లారీలు దిగుతున్నాయి

– కార్యకర్తలను నాయుడు ప్యాకేజీలు పెట్టి కొంటున్నాడు

– ప్రజలంతా అభివృద్ధిని చూసి ఓట్లేయండి

– నాలుగేళ్లలో బీడీ కార్మికులను ఆదుకున్నాం

– నిజామాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌

నిజామాబాద్‌, నవంబర్‌26(జ‌నంసాక్షి) : బీడీ కార్మికులకు దేశంలో ఎన్ని సంఘాలు ఉన్నా, ఎన్ని పోరాటాలు చేసినా వారి సమస్యలు పరిష్కారం కాలేదని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలో పెద్దపెద్ద నేతలు ఉన్నా ఒక్కరు కూడా కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. దేశచరిత్రలో తొలిసారి బీడీ కార్మికులకు రాష్ట్రంలో నెలకు రూ.1,000 పెన్షన్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్‌ లో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మరో రూ.వెయ్యి పెంచుతామని హావిూ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమ్మాయి పుడితే రూ.13,000, అబ్బాయి పుడితే రూ.12 వేలు అందజేస్తున్నామని వ్యాఖ్యానించారు. చిన్నారుల కోసం కేసీఆర్‌ కిట్‌ అందజేస్తున్నామన్నారు. అవ్వాతాతలకు పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా పథకాలతో తెలంగాణను సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దామని అభిప్రాయపడ్డారు. ఇన్నిఅభివృద్ధి పథకాలు, పనులు చేపడుతుంటే విపక్షాలకు ఓటేయాల్సిన అవసరం ఏముందని కేసీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికలవేళ విపక్ష నేతలు ఊరికి ఓ లారీ చొప్పున చీప్‌ లిక్కర్‌ మద్యాన్ని దించుతున్నారని కేసీఆర్‌ ఆరోపించారు. ఆంధప్రదేశ్‌ కు చెందిన చంద్రబాబు ప్యాకేజీలు పెట్టి ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేస్తున్నాడని విమర్శించారు. ఈ ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమయం అవుతుందనీ, జనరేటర్ల అమ్మకాలు పెరుగుతాయని సెటైర్లు విసిరారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు తెలివి, దమ్ము లేదనీ, అందుకే ఆంధ్రా సీఎం చంద్రబాబును భుజాలపై కూర్చోబెట్టుకుని తీసుకొచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్టుపై చంద్రబాబు 30 ఉత్తరాలు, 65 కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఈ నియోజకవర్గంలో అన్ని బాగానే ఉన్నాయని, సాగునీరు ఇవ్వాలని బాజిరెడ్డి గోవర్ధన్‌ కోరాడన్నారు. సాగునీళ్ల బాధేందో నాకు బాగా తెలుసని, ఆయన కోరిక ప్రకారం రాబోయే రెండేళ్లలో లక్షా పది వేల ఎకరాలకు సాగునీరిస్తామని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. విూ పొలాలు తప్పకుండా పచ్చబడుతాయని, దాని గురించి ఆలోచన చేయొద్దని తెలిపారు. జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని, ఈ ఒక్క నియోజకవర్గంలో 65,700 మందికి ఆసరా

పెన్షన్లు వస్తున్నాయని అన్నారు. లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలు చేశాం. 50 తండాలకు గిరిజనులు సర్పంచ్‌లు కాబోతున్నారని కేసీఆర్‌ తెలిపారు. ఈ ఎన్నికలు అయిపోయిన నెలకే సర్పంచ్‌ ఎన్నికలు జరుగుతాయని, 3500ల మంది గిరిజన బిడ్డలు సర్పంచ్‌లు అవుతారన్నారు. ఈఅవకాశం ఒక్క టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. హైదరాబాద్‌ను తానే కట్టిన అని చంద్రబాబు అంటున్నాడని, కులీకుత్‌బ్‌ షా ఎక్కడ పోవాలె అని ప్రశ్నించారు. ల్గ/దరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టిన అని చెబుతున్నాడని, మరి కరెంట్‌ ఎక్కడ పెట్టిండని ప్రశ్నించారు. చంద్రబాబు వట్టి మాటలు మాట్లాడుతున్నాడని, తెలంగాణలో 24గంటల కరెంట్‌ ఇస్తున్నామని, రైతుల బాధల గురించి ఎవరూ ఆలోచించలేదన్నారు. కాళేశ్వరం నీళ్లు తెచ్చి రైతుల పాదాలు కడుగుతామని అన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారు. ఎన్నికలు రాగానే ఎంతోమంది వచ్చి ఏవో చెబుతుంటారని, వాటన్నింటినీ ఆలోచించి ఓటు ఎవరికీ వేయాలో విూరే ఆలోచించుకోవాలి అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.