కాంగ్రెస్‌ గెలిస్తే అభివృద్ధిని ఆపేస్తారు

` 50 ఏండ్లు పాలించి ఏం ఉద్ధరించారు
` ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి
` గ్రామాల్లోకి వస్తే ఆ పార్టీ నాయకులను నిలదీయండి
` మేం సంపద పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతున్నాం
` తెలంగాణ బాగు కోసమే పుట్టింది బీఆర్‌ఎస్‌ పార్టీ
` పైరవీకారులు, మతచిచ్చుగాళ్లు రాకుండా ప్రజలే అడ్డగించాలి
` భైంసా, ఆర్మూర్‌, కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పిలుపు
నిర్మల్‌, భైైంసా/ఆర్మూర్‌/కోరుట్ల (జనంసాక్షి):‘బీఆర్‌ఎస్‌ పదేండ్ల ప్రభుత్వంలో, 50 ఏండ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏం జరిగిందో మీ సొంత అనుభవంలో ఉంది. అవన్నీ బేరీజు వేసుకోవాలి. ఆలోచించి ఓటేయాలి’ అని సీఎం కేసీఆర్‌ సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ గెలిస్తే తెలంగాణలో అభివృద్ధిని ఆపేస్తుందని హెచ్చరించారు. 50 ఏండ్ల పాలనలో ప్రజల కోసం ఏం ఉద్ధరించారో ఆ పార్టీ నేతలు ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రైవేటైజేషన్‌ పిచ్చిపట్టిన ప్రధాని మోడీ, బీజేపీ పార్టీ కూడా చేసిందేమీ లేదని, ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వనివాళ్లకు ఎందుకు ఓటు వెయ్యాలని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మొద్దని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌ జిల్లా భైంసా, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌, జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఆ అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ, దాని చరిత్ర, ఆ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, నేతల దృక్పథం చూసి వివేకంతో ఓటు వెయ్యాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి ఎత్తేస్తామని చెబుతున్నారని, అదే జరిగితే మళ్లీ పైరవీలు మొదలవు తాయని, అన్నదాతలు అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ప్రధాని మోదీ రాష్టాన్రికి ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదని కేసీఆర్‌ విమర్శించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే కనీసం ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్‌ పుట్టిందని, ప్రజల సంక్షేమం కోసం అనేక హావిూలు అమలు చేసినట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ముథోల్‌ నియోజకవర్గంలో మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటికే గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాలకు సాగునీరు పారుతుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. భైంసా, ముథోల్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌లో ముస్లింలు హిందువులు ఉన్నారని కేసీఆర్‌ గుర్తు చేశారు. వందల ఏండ్ల నుంచి కలిసి బతుకుతున్నామని, కానీ తాకులాటలు పెట్టి మతపిచ్చి లేపి భైంసా అంటేనే యుద్ధమన్నట్టు చిత్రీకరించడం బాధాకరమని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలనలో పదేండ్లుగా ప్రశాంత వాతావరణం ఉందన్నారు. మన రాష్ట్రంలో ఉన్న అన్ని మతాలు, కులాల వారు కలిసి ముందుకు పోవాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.
అంకాపూర్‌ అంటే నాకు ప్రాణం
ఆదాయం పెరిగే కొత్తీ సంక్షేమ కార్యక్రమాలు చెంచుతున్నామని ఆర్మూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్‌ అన్నారు. 10 హావిూలిచ్చి, 100 హావిూలు నెరవేర్చామని అన్నారు. దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న ఎస్సీలు బాగు పడాలనే ఉద్దేశంతోనే దళిత బంధు పథకం తెచ్చామని, ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఆర్మూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవన్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆర్మూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. జీవన్‌ రెడ్డి ఏదైనా కావాలంటే పట్టుదలతో సాధిస్తడు. అందుకే నమ్ముకున్న ప్రజల కోసం పనులు చేయిస్తడు. అందుకే విూ అభిమానం ఇవాళ కనబడుతుంది అని కేసీఆర్‌ పేర్కొన్నారు. అంకాపూర్‌ అంటే ప్రాణంతో సమానమన్నారు. బహుషా ఈ ప్రపంచంలో అంకాపూర్‌ గురించి నేను చేసినంత ప్రచారం ఎవరూ చేయలేదు అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అభ్యుదయమైన రైతులు.. వారి చైతన్యంతో వందలాది గ్రామాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని వివరించారు.
బీడీకార్మికుల వ్యథ చూసే పెన్షన్లు ఇస్తున్నాం
కోరుట్ల సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మవద్దు. నమ్మి మోసపోవద్దు. సంజయ్‌ మంచి వైద్యుడని, ఆయన తలుచుకుంటే వృత్తి ద్వారా కోట్లు సంపాదించుకోవచ్చని, కానీ నేను నా గడ్డకు సేవ చేసుకుంటా అనే సంకల్పంతో పోటీకి సిద్ధమైండని అన్నారు. డాక్టర్‌ సంజయ్‌ స్థానిక బిడ్డ. ఆయనను విూరంతా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం కేసీఆర్‌ కోరారు.  బీడీ కార్మికులు కష్టజీవులు.. వారి బాధలను కండ్లారా చూశాను అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమోషనల్‌ అయ్యారు. ఎవరూ దరఖాస్తు పెట్టకముందే బీడీ కార్మికులకు పెన్షన్‌లు మంజూరు చేశాను. కొత్తగా నమోదైన బీడీ కార్మికులకు తప్పకుండా పెన్షన్‌ మంజూరు చేస్తాను.. ఇది నా వాగ్దానం, రంది పడాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ఎన్నో ఏండ్ల నుంచి విూ సేవలో ఉన్నారని కేసీఆర్‌ గుర్తు చేశారు. పార్టీల యొక్క నడవడిక, వైఖరి గురించి ఆలోచించాలి. గతంలో అవకాశం ఇస్తే ఏం చేశారో ఆలోచించాలి. ఉద్యమం ప్రారంభించినప్పుడు విూరు చాలా మంది ఉన్నారు. మెట్‌పల్లి, కోరుట్లకు వచ్చాను. విూరంతా కలిసి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. చేనేత కార్మికులు సిరిసిల్ల, భూదాన్‌ పోచంపల్లి, దుబ్బాకలో ఆరేడుగురు చనిపోవడం.. మేం పోయి ఆ శవాలను పట్టుకొని ఏడ్వడం జరిగాయని కేసీఆర్‌ గుర్తు చేశారు. పోచంపల్లిలో ఏడుగురు నేతన్నలు చనిపోతే నేను పోయి ఆ శవాలను పట్టుకొని అప్పుడున్న సీఎంకు రెండు చేతల దండం పెట్టి బతిమాలిడాను. ఒక యాభై వేలో, లక్ష రూపాయాలో ఇవ్వమని అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని కేసీఆర్‌ గుర్తు చేశారు.