కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో : మంత్రి హరీశ్‌రావు
యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతోషపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే శుభవార్త చెబుతారని తెలిపారు.నకిరేకల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి హరీశ్‌రావు రామన్నపేటలో ఎస్‌టీవో కార్యాలయం ప్రారంభించారు. రూ. 5.5 కోట్లతో నిర్మించే 50 పడకల ఆసుపత్రికి, రూ.2.5 కోట్లతో నిర్మించే చెన్నకేశవ స్వామి దేవాలయం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇంటింటికి మంచినీళ్లు అందించి, ఆడబిడ్డల కష్టాలు తీర్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేలు గ్రామాలకు వచ్చే కంటే ముందు.. నీళ్ల ట్యాంకర్లు వచ్చేవన్నారు. దేశంలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ మాత్రమే అని పేర్కొన్నారు.కాంగ్రెస్ వాళ్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. 50 ఏళ్ల నుండి ఎందుకు పెన్షన్లు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అక్కడ చేతకానిది.. ఇక్కడ ఎలా సాధ్యమవుతుంది అని అడిగారు. ఆడబిడ్డ ఉన్న తల్లికి కొండంత అండ కేసీఆర్ అని పేర్కొన్నారు.కాంగ్రెస్ నాయకులు కరెంట్ గురించి మాట్లాడితే సూర్యుడి విూద ఉమ్మి వేసినట్లే అని మంత్రి చెప్పారు. విూ పాలనలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతం. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కరెంట్ గురించి ఎంత మాట్లాడితే అంత మంచిది మాకు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ బాగుందా, మా పాలనలో కరెంటు బాగుందా అని ప్రజలనే తీర్పు కోరుదాం. దాని విూదే ఎన్నికలకు పోదాం అని చెప్పారు. ఓట్ల కోసం ఆపద మొక్కులు కాంగ్రెస్ పార్టీవి అని ధ్వజమెత్తారు. అందరూ కేసీఆర్ నాయకత్వాన్ని దీవించాలి. ఎమ్మెల్యే లింగయ్యకు కనీసం హైదరాబాద్‌లో ఇల్లు కూడా లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన నకిరేకల్ ప్రజల సేవ కోసం కృషి చేస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.