కార్తి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట 

– విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు
న్యూఢిల్లీ, మే18(జ‌నం సాక్షి ) : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి చిదంబరం తనయుడు కార్తి చిదంబరానికి సుప్రీంకోర్టులో గొప్ప ఊరట లభించింది. ఆయన విదేశాలకు వెళ్ళేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 19 నుంచి 27 వరకు బ్రిటన్‌, జర్మనీ, స్పెయిన్లలో పర్యటించేందుకు అనుమతించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. విదేశాల్లో బ్యాంకు ఖాతాలను కొత్తగా తెరవడం కానీ, ప్రస్తుతం ఉన్న ఖాతాలను మూసివేయడం కానీ చేయకూడదని ఆదేశించింది. ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను కూడా నిర్వహించరాదని స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్ళే విమానం వివరాలు, తిరిగి భారతదేశానికి వచ్చే తేదీ వంటి వివరాలను రాతపూర్వకంగా సమర్పించాలని తెలిపింది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు పాస్‌పోర్టును సమర్పించాలని ఆదేశించింది. కార్తి చిదంబరంపై ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కుంభకోణం తదితర కేసుల్లో విచారణ జరుగుతోంది. సీబీఐ, ఈడీ ఆయనపై అవినీతి, మనీలాండరింగ్‌ చట్టాల ప్రకారం కేసులను నమోదు చేశాయి.