కార్మిక కర్షక ఐక్యతతో
హక్కులను సాధించుకుందాం
– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్
కొమురవెల్లి జనం సాక్షి
కేంద్రంలోని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక కర్షకులు ఐక్యం కావాలని, అప్పుడే హక్కులను సాధించుకుంటామని తెలంగాణ రైతు సంఘం మూడ్ శోభన్ పేర్కొన్నారు. ఆదివారo
కొమురవెల్లి మండల రైతు సంఘం 2వ మహాసభ బద్దిపడగ కృష్ణా రెడ్డి అధ్యక్షతన రైతు సంఘం కార్యాలయంలో జరిగింది. అనంతరం శోభన్ మాట్లాడుతూ.. నాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాత్రంత్ర ఉద్యమం జరిగిందని, ఆ రోజున వామపక్ష, కాంగ్రెస్ వాదులు మాత్రమే పోరాటంలో పాల్గొన్నారని, ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి వాదులంతా ప్రాణ భయంతో తప్పించుకున్నారని అన్నారు. నేడు వారే దేశభక్తులమని చాటుకోవడం ప్రజలంతా గమనించాలన్నారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయాలని, ఇది మా దేశభక్తిని బిజెపి చాటుకోవడం దుర్మార్గమని చెప్పారు. గతంలో జాతీయ జెండా వద్దు బిజెపి జెండా ముద్దు అని వారు అన్నారని, ఇటువంటి వారు దేశాన్ని కాపాడుతామని ప్రగల్బాలు పలకడం దుర్మార్గమన్నారు. నిజమైన దేశభక్తులయితే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకుండా ప్రజల సంక్షేమం కోసం ఉంచాలని, నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి సెట్టిపల్లి సత్తిరెడ్డి మాట్లాడుతూ.. రైతులందరికీ ఉచిత కరెంటు పది గంటలపాటు ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 200 రోజులు ఉపాధి హామీ పని కల్పించి రోజువారి కూలి 600 రూపాయలు ఇవ్వాలన్నారు. అలాగే 44 కార్మికుల చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా కుదింపు చేయకుండా సక్రమంగా అమలు చేయాలని, అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర వేతనం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని, నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయాలని, అప్పుడే దేశ సంక్షేమం కోసం, దేశ ప్రజల కోసం పనిచేసిన వారవుతారన్నారు
నూతన కమిటీ ఎన్నిక
మండల నూతన అధ్యక్షులుగా తడ్కపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా చింతల శ్రీనివాస్, సార్ల యాదయ్య, ప్రధాన కార్యదర్శి గా బద్దిపడగా కృష్ణా రెడ్డి, సహాయ కార్యదర్శిగా సున్నం యాదగిరి, చొక్కం స్వామి, కమిటీ సభ్యులుగా పాశం చెంద్రయ్య, ఆరుట్ల దయానంద్, వీల శ్రీనివాస్, పులస మల్లేశం, దూడ వెంకట రెడ్డి, చెరుకు వెంకట రెడ్డి, దాసరి బాలస్వామి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నక్క యాదవ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.