కాళేశ్వరం పూర్తయితే కరవు అనే పదం ఉండదు

సిపిఐ చాడ వెంకట్‌రెడ్డికే టిక్కెట్‌ దొరకని దుస్థితి

అలాంటప్పుడు కూటమి ఎందుకో

ఎద్దేవా చేసిన మంత్రి హరీష్‌ రావు

తెలంగాణ కార్మిక సంఘంలో చేరిన ఎర్ర కార్మికులు

సిద్దిపేట,నవంబర్‌3(జ‌నంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కరవు అనే పదం తెలంగాణాలో ఉండదని తెలంగాణా భారీ నీటిపారుదల శాఖామంత్రి, టీఆర్‌ఎస్‌ నేత తన్నీరు హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతరంగా శ్రమిస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో కరువు అనే మాట డిక్షనరీలో నుంచి తొలగిపోతుందన్నారు. సిద్ధిపేట కొండ మల్లయ్య గార్డెన్‌లో మంత్రి హరీష్‌ రావుకి ఆత్మీయ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన హరీష్‌ రావు మాట్లాడుతూ..సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డికే టికెట్‌ రాకపోతే ఆ మహాకూటమి ఎందుకు అని ఎద్దేవా చేశారు. సిద్ధిపేటలో బ్రహ్మాండమైన కార్మికభవన్‌ కట్టుకున్నామని చెప్పారు. హరీష్‌ రావుకు మద్దతుగా జిల్లా హమాలి కార్మికుల ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభావేదికగా ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి సీపీఐ, ఏఐటీయూసి నుంచి దాదాపు వెయ్యి మంది కార్మికులు హరీష్‌ రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగంలో చేరారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన హరీష్‌ రావు.. సీపీఐపై విమర్శలు గుప్పించారు. సీపీఐ దారి ఎటో తెలియడం లేదని విమర్శించారు. మహాకూటమిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డికే సీటు లభించని దుస్థితి నెలకొందన్నారు. మహాకూటమి నేతలు పొద్దునో మాట.. రాత్రికి మరో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రా బాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టడాన్ని సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. హమాలి కార్మికులకు రూ.5 లక్షల భీమా పథకం అమలుకు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి మేనిఫెస్టోలో పెట్టేలా చూస్తానని హావిూ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా తీర్చిదిద్ది పేదలకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్నామని హరీష్‌ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌, ఐసీయూ కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీదైన వైద్యాన్ని అందిస్తుందన్నారు. నేను సర్కారు దవాఖానాలకు పోతా బిడ్డా అనేలా నేడు ప్రభుత్వ ఆసుపత్రులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీర్చిదిద్దిందని వ్యాక్యానించారు. పేద ప్రజలకు ఉచిత నాణ్యమైన వైద్యం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. తాము అధికారం లోకి వస్తే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను బంద్‌ చేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, అంటే బాగా తాగి బండి నడిపి మనుషులను గుద్ది చంపాలని కోరుకుంటోంది అని విమర్శించారు. ఇన్ని రోజులు మనుషులు ఎర్రజెండా కింద ఉన్నా, విూ మనసులు గులాబీ జెండా కిందే ఉన్నాయని వ్యాఖ్యానించారు. అన్ని హక్కులు గులాజీ జెండా కిందనే సాధించుకుంటామని అందరూ ఎర్ర జెండా వదిలి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. ఆంధ్రాబాబు చంద్రబాబు దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడం ఇష్టం లేక ఎర్ర జెండా వదిలి టీఆర్‌ఎస్‌ జెండా కప్పుకుంటున్నారని అన్నారు. ఈటెల రాజేందర్‌ నాయకత్వంలో పౌరసరఫరాల శాఖ బ్రహ్మాండంగా ముందుకు వెళ్తోందని వ్యాఖ్యానించారు. బస్తా కూలీ రూ.8 నుంచి 14 కు పెంచిన ఘనత ఈటెల రాజేందర్‌కే దక్కుతుందన్నారు. అప్పుడు పౌరసరఫరాల శాఖ కార్మికులకు లాభం జరుగుతుందని చెప్పారు. పెన్షన్‌ వయసు 60 నుంచి 57కు తగ్గించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కల్యాణలక్ష్మీ పథకాన్ని కాంగ్రెస్‌ వాళ్లు బంద్‌

చేస్తే కాంగ్రెస్‌ దుకాణం తెలంగాణాలో బంద్‌ అవుతుందని జోస్యం చెప్పారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల విషయంలో కార్మికులకు సహాయం చేస్తామని వెల్లడించారు. స్వంతగా ఇల్లు నిర్మించుకునే వారికి రూ.5 లక్షల సహాయం అందిస్తామని తెలిపారు. విూకు నా పూర్తి సహకారం ఎల్లవేళలా ఉంటుందని హావిూ ఇచ్చారు. నెల రోజులు విూరు కష్టపడండి..మిగతా 5 సంవత్సరాలు తాము కష్టపడి పని చేస్తామని హరీష్‌ రావు అన్నారు.