‘కాళేశ్వరం’ భూమిపూజ పూర్తి

CM-MEDIGADDA-1రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరందించాలన్న సీఎం కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో అడుగు పడింది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అంకురార్పణ జరిగింది. కరీంనగర్ జిల్లా కన్నెపల్లి దగ్గర పంపు హౌజ్ నిర్మాణానికి, మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ దంపతులు భూమి పూజ చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య.. శాస్ర్రోక్తంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రులు ఈటెల, హరీష్రావు, పోచారం, ఎంపీలు కేకే, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బ్యారేజీ నిర్మాణం పూర్తికాక ముందే పంప్ హౌస్ల ద్వారా నీరు వాడుకోవచ్చని చెప్పారు. మేడిగడ్డ ద్వారా కరీంనగర్ జిల్లాలో రెండు పంటలు పండించుకోవచ్చని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అని ముఖ్యమంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించిందని చెప్పారు.

అటు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని నాలుకలున్నయో వాళ్లకే తెలియదని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎందుకు ధర్నా చేస్తున్నరో అర్థం కావడం లేదని అన్నారు. కొద్ది రోజుల్లోనే మహారాష్ట్రతో ఫైనల్ అగ్రిమెంట్ పూర్తి చేసుకుంటామని స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు ఇకనైనా పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని ముఖ్యమంత్రి హితవు పలికారు. పిడుగులు పడ్డా, భూకంపాలొచ్చినా రాష్ట్ర వాటా నీటిని వాడుకొని తీరతామన్నారు.

అంతకుముందు.. కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న వారికి.. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రం వస్తే శుభానందదేవికి స్వర్ణకిరీటం బహూకరిస్తానని మొక్కుకున్న ముఖ్యమంత్రి ఆ మొక్కు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రికి అందజేశారు.