కావేరి జలాలపై సిఎం అఖిలపక్షం

సమస్య పరిష్కారంపై చర్చ

బెంగుళూరు,జూన్‌30(జ‌నం సాక్షి): కర్ణాటకలో కావేరి జలాల అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి దృష్టి పెట్టారు. ఈ సమస్యను ఏ విధంగా తీర్చాలన్న దానిపై విపక్షాలతో సమావేశం ఏర్పాటు చేశారు. బెంగళూరులో సీఎం కుమారస్వామి ఆధ్వర్యంలో అఖిపలక్ష సమావేశం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ సహా పలు పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. తమిళనాడు, కర్ణాటక ల మధ్య దశాబ్దాలుగా కావేరి జలాల వివాదం కొనసాగుతోంది. ఇటీవలే కావేరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిని కర్ణాటక వ్యతిరేకించటంతో ఇప్పటి వరకు కావేరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు కాలేదు. ఐతే ఇటీవల ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని కర్ణాటక సీఎం కుమారస్వామి నిర్ణయించారు. ఇందులో భాగంగానే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రధాని మోడీకి పంపించనున్నారు.