కావేరీపై ఎన్నికల ప్రభావం

– కేసును వాయిదా వేయాలన్న కర్ణాటక.
చెన్నై, మే16(జ‌నం సాక్షి) : కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అది కాస్తా కావేరీ జలాల కేసుపై ప్రభావం చూపింది. తమిళనాడులో కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు నిర్వహించాలన్న నేపథ్యంలో ఇటీవల కేంద్రం సుప్రీంకోర్టులో ముసాయిదాను సమర్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల తీర్పుపై స్పష్టత లేకపోవడంతో కేసును వాయిదా వేయాల్సిందిగా కర్ణాటక సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. కానీ ఇందుకు తమిళనాడు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.చాలా కాలంగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదం నేపథ్యంలో ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ తమిళనాడు కంటే కర్ణాటకకే ఎక్కువ టీఎంసీలు అందాలని ఆదేశించింది. దాంతో తమిళనాడులో ఆందోళనలు మిన్నంటాయి. కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటుచేయాలని తమిళనాడు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ ఇప్పుడు ఇస్తున్న దానికంటే 4 టీఎంసీలు ఎక్కువగా తమిళనాడుకు కావేరీ నీరు కేటాయించాలని.. లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కర్ణాటకను ఆదేశించింది. కానీ ఇందుకు కర్ణాటక ఒప్పుకోలేదు. ఇప్పుడు ముసాయిదాను సమర్పించడంతో తమిళనాడులో మేనేజ్‌మెంట్‌ బోర్డు విషయమై సుప్రీం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
————————————