కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

2

శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌కు భారీగా ఆర్మీ బలగాలను కేంద్రం తరలిస్తోంది. జులై 8న జరిగిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నాటి నుంచి ఆ రాష్ట్రం అల్లర్లతో అట్టుడుగుతోంది. ఆందోళనల్లో సుమారు 70 మందికిపైగా మృతి చెందగా, పది వేలకుపైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువగా జవాన్లే. వేర్పాటువాద నేతల పిలుపుతో రెండు నెలలకుపైగా కశ్మీర్‌ స్థంభించింది. 65 రోజులకుపైగా వరుస సమ్మెతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.చర్చలకు వేర్పాటువాదులు ముందుకు రాకపోవడంతో కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడంతో పాటు కశ్మీర్‌లో సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు ఆర్మీని కూడా రంగంలోకి దింపుతోంది. మారుమూల గ్రామాల్లో ఉన్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు సైనికుల్ని వినియోగించనుంది. దీంతో యువత అల్లర్లపై జమ్మూ కశ్మీర్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు దృష్టిపెట్టనున్నారు.