కాశ్మీర్‌ అల్లర్లవెనుక పాక్‌ హస్తం

4

– మెహబూబా

– ప్రధాని మోదీతో కాశ్మీర్‌ సీఎం భేటీ

న్యూఢిల్లీ,ఆగస్టు 27(జనంసాక్షి):కాశ్మీర్‌లో పరిస్థుతులపై  జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించారు. గత కొన్నిరోజులుగా అక్కడ ఏర్పడ్డ పరిస్థితులను వివరించారు. శనివారం ఆమె ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దిల్లీలోని ప్రధాని కార్యాలయంలో మోదీని కలిసిన ముఫ్తీ.. కశ్మీర్‌ లోయలో పరిస్థితులపై చర్చించారు. అనంతరం మెహబూబా విూడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్‌ అంశంపై ప్రధాని స్పందించడం సంతోషంగా ఉందన్నారు. ఘటనపై భారత్‌, పాక్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే ఆందోళనకర పరిస్థితులకు తెరపడుతుందన్నారు.

బుర్హన్‌ వనీ ఘటన అనంతరం ముఫ్తీ ప్రధానితో భేటీకావడం ఇదే తొలిసారి. రెండు రోజుల క్రితమే రాజ్‌నాథ్‌ కాశ్మీర్‌లో పర్యటించి అక్కడి నేతలతో చర్చించారు. సిఎం మెహబూబాతో కూడా చర్చించారు. తరవాత ఆమె ప్రధానిని కలిసేందుకు ఢిల్లీకి వచ్చారు.  కశ్మీర్‌ సమస్య పట్ల ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీ తెలిపారు. పొరుగు దేశం పాకిస్తానే కశ్మీర్‌లో హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తోందని ముఫ్తీ విమర్శించారు. శుక్రవారం ఢిల్లీకి చేరుకున్న ఆమె శనివారం  7 రేస్‌ కోర్స్‌ రోడ్డులో ఉన్న ప్రధాని నివాసానికి వెళ్లారు. కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కశ్మీర్‌లో పర్యటించిన రెండు రోజుల తర్వాత ఆ రాష్ట్ర సీఎం ముఫ్తీ ప్రధానిని కలవడం విశేషం. కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌ తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందని ముఫ్తీ ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం చర్చలను వాడుకోవడంలో పాక్‌ విఫలమైందన్నారు. కశ్మీర్‌లో ఉన్న సమస్యను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్‌ ఆ పరిస్థితిని మరింత జఠిలం చేస్తోందని ముఫ్తీ అన్నారు. కశ్మీర్‌లో హింసను పాకిస్తానే రెచ్చగొడుతోందన్నారు. కశ్మీర్‌ సమస్యను చల్లార్చేందుకు విూడియా సహకరించాలని ఆమె కోరారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారం కోసం మోదీ, రాజ్‌నాథ్‌లు పాక్‌కు వెళ్లారు, కానీ ఆ సమస్యపై ఇప్పుడు పాకిస్తాన్‌ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్‌ స్టేషన్లపై రాళ్లు రువ్వాలని తల్లులు ప్రోత్సహించడం కలిచి వేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హింస వల్ల మనకు ఎంత ఇబ్బంది అవుతోందో, వాళ్లు కూడా అంతే బాధపడుతున్నారని ఆమె అన్నారు.

ఇదిలావుంటే  కశ్మీర్‌ పరిస్థితులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోనే విపక్ష బృందం ఇటీవల ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌వనీని భద్రతాసిబ్బంది మట్టుబెట్టిన నేపథ్యంలో కశ్మీర్‌లోయ కల్లోలంగా మారింది. ఈ ఘటన జరిగి దాదాపు రెండు నెలలు కావస్తున్నా.. కశ్మీర్‌లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 70 మందికి పైగా మృతిచెందగా.. వేలాది మంది గాయపడ్డారు.