కివీస్ బోర్డు కాంట్రాక్ట్ తిరస్కరించిన వెటోరీ
వెల్లింగ్టన్ ,జూలై 5 (జనంసాక్షి):
న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ డానియల్ వెటోరీ క్రికెట్ కెరీర్ సందిగ్ధంలో పడింది. 2013-14 సీజన్‌కు సంబంధించి ఆ దేశ క్రికెట్ బోర్డు ఇచ్చిన కాంట్రాక్టును వెటోరీ తిరస్కరించాడు. వరుస గాయాలే దీనికి కారణంగా భావిస్తున్నారు. దాదాపు మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న వెటోరీ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అయితే తర్వాత కాలి మడమకు సర్జరీ కావడంతో ప్రస్తుతం స్టిక్స్ సహాయంతోనే నడుస్తున్నాడు. శుక్రవారం జరిగిన విూడియా సమావేశానికి కూడా వెటోరీ కర్రల సాయంతోనే వచ్చాడు. తాను ఎందుకు కాంట్రాక్ట్ తిరస్కరించిందీ వెల్లడించాడు. మరో ఆరు నెలల పాటు మైదానంలో అడుగుపెట్టే అవకాశం లేదని, అందుకే కాంట్రాక్ట్ వద్దని చెప్పినట్టు వివరించాడు. ఈ కివీస్ స్పిన్నర్ టెస్ట్ మ్యాచ్ ఆడి దాదాపు ఏడాది కావొస్తోంది. ప్రస్తుతం తాను కోలుకోవడంపైనే దృష్టి పెట్టానని, వచ్చే ఆరు నెలలు పూర్తిగా విశ్రాంతికే పరిమితమని చెప్పాడు. అయితే తన కెరీర్ మాత్రం ముగిసిపోలేదని వ్యాఖ్యానించాడు. ఇంత కాలం విశ్రాంతి అవసరమని స్పష్టంగా తెలిసినప్పుడు కాంట్రాక్ట్ తీసుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. 34 ఏళ్ళ వెటోరీ ఇప్పటి వరకూ 112 టెస్టుల్లో 360 వికెట్లు , 275 వన్డేల్లో 284 వికెట్లు పడగొట్టాడు. వెటోరీ నిర్ణయంపై పలువురు మాజీ ఆటగాళ్ళు హర్షం వ్యక్తం చేశారు.