కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

  qee49w6e
 మహారాష్ట్రలోని థానే నగరంలో మంగళవారం రాత్రి మూడు అంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది క్షతగాత్రులు బయటపడ్డారు. శిథిలాల కింద మరో 20 మంది ఉండవచ్చని సహాయక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
మహారాష్ట్రలోని థానే జిల్లా థకుర్లీలో మూడు అంతస్తుల ‘మాతృఛాయ’ భవనం ఉంది. ఈ భవనంలో 5 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ భవనం మంగళవారం రాత్రి అకస్మాత్తుగా కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల్లో చిక్కుకున్న పలువురిని రక్షించారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అక్కడ భారీ వర్షం కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.