కులరహిత సమాజం ఎండమావేనా ? 

దేశాన్ని కులమతాలకు అతీతంగా అభివృద్ది చేసే క్రమంలో రాజకీయ పార్టీలు పూర్తిగా విఫలం అయ్యాయని అనడంలో సందేహం లేదు. ఎంతసేపు ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప మరో కోణంలో పార్టీలు ఆలోచిం చడం లేదు. కులం,మతం, జాతి, భాష పేరు చెప్పి ఓటర్లను ఆకర్షించటానికి ప్రయత్నించడం, ఓట్లు వేయమని అడగడం అవినీతేనని, చట్టరీత్యా నేరమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని సెక్యులర్‌ విలువలకు అద్దం పట్టేలా ఎన్నికల పక్రియ ఉండాలని స్పష్టం చేసింది. మతం అనేది పూర్తిగా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించినది మాత్రమేనని,రాజ్యానికి, మతానికి ఎటువంటి సంబంధం ఉండ కూడదని నిర్దేశించింది. ఇలా ఓట్లు అడగటం అవినీతి కిందికే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినా ఎక్కడికి వెళ్లినా కులమత ప్రస్తావన లేని రాజకీయ పార్టీలు కానరావడం లేదు. ఏదో రకంగా ఓటర్లను ప్రలోభ పర్చుకునే యత్నం తప్ప మరోటి కానరావడం లేదు. స్వయంగా ప్రధాని మోడా బిసి కార్డు వాడుతున్నారు. కర్నాటక తమిళనాడుల్లో కూడా ఇదే పద్దతి ఇతర పార్టీల్లో కనిపిస్తోంది. యూపి, బీహార్‌ల్లో కూడా ఇందుకు భిన్నంగా ప్రచారం కానరావడం లేదు. నిబద్ద రాజకీయాలు మంటగలిశాయి. ఇందుకు బిజెపి కూడా మినహాయింపు కాదు. దేశాన్ని  ఐక్యంగా ఉంచే విధంగా తీసుకుంటున్న చర్యలు మృగ్యం. కుల వ్యవస్థను పెంచి పోషించారని మని పూర్వీకులను తిట్టిపోస్తున్న కమ్యూనిస్టులు సైతం కుల ఆధార రాజకీయాలనే నెరుపుతున్నారు. కులాల వారీగా వరాలిచ్చి ఓట్లను కొల్లగొడుతున్నారు. ఈ దేశంలో ఉన్నది పేదలు, నిరుపేదలు, ధనవంతులు అన్న కోణంలో కార్యక్రమాలు రూపొందండం లేదు. ఈ రకంగా పార్టీలు తమ ఎన్నికల ప్రణాళిలకలను రూపొందించుకోవడం లేదు. యూపి,బీహార్‌ లాంటి రాష్ట్రంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుని ఈ కోణంలోనే ఓట్ల జాతర సాగుతోంది. కులాల ఆధారంగా టిక్కెట్ల కేటాయింపులు సాగుతున్నాయి.  భవిష్యత్‌లో కులరహిత సమాజం కోసం పాటుపడే రాజకీయ పార్టీలు కానరావడం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా ఓట్లు అడగటాన్ని నిషేధిస్తూ సుప్రీం గతంలో సంచలన తీర్పును ప్రకటించింది. రాజకీయ నేతలు పరిణతితో చేయాల్సిన పని చేయకపోవడం వల్ల అనేక మార్లు కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. రాజ్యాంగంలోని లౌకిక  విలువలకు అద్దం పట్టేలా ఎన్నికల పక్రియను నిర్వహించాలని హితవు పలికింది. మనిషికి దేవుడికి మధ్య ఉన్న సంబంధం పూర్తిగా వ్యక్తిగత ఇష్టాయి ష్టాలకు పరిమితమైనదని అందరికీ తెలుసు. కానీ దీనిని కూడా ఓట్ల రాజకీయాలకు జోడించి మన నాయకులు, పార్టీలు లబ్దిపొందాలని చూస్తున్నాయి. కులసంఘాలను ప్రోత్సహించడం, కులాల వారీగా తాయిలాలు ప్రకటించడం ఇవన్నీ కూడా ఓట్ల రాజకీయాలు కాక మరోటి కాదు. రాజ్యాన్ని, మతాన్ని కలగలుపటానికి రాజ్యాంగం అంగీకరించదని తెలిసి కూడా దాని నుంచి మనం బయటపడలేక పోతున్నాం. ఎన్నికల్లో పోటీ చేసే  ప్రజాప్రతినిధి పనితీరు పూర్తిగా లౌకిక విలువలతో కూడి ఉండాలి. ఎన్నికల్లో మతానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేస్తూ, ఎన్నికల బరిలో పాల్గొనే అభ్యర్థులతోపాటు ఓట్లు వేసే ఓటర్ల మతం, కులం, జాతి, భాష ఆధారంగా ప్రచారం నిర్వహించటం తగదు. కులం, మతం తదితర అంశాలను ఎన్నికల పక్రియలో ఉపయోగించకుండా నిషేధం. కుల మతాల్ని అడ్డుపెట్టుకుని ఓట్లడుగు తున్న వారికి ఓటర్లు గట్టి బుద్ది చెప్పాలి. రాజకీయాల నుంచి కుల, మతాల్ని వేరుచేసే పార్టీలను మాత్రమే ఆదరించాలి. నిజానికి ఇంతకాలం కులం, మతం, జాతిపై ఆధారపడిన రాజకీయాలు దేశానికి చాలా హాని చేశాయి. జాతీయ సమైక్యతనూ దెబ్బతీశాయి. ఆధునిక రాజ్యానికి లౌకికత్వం ఒక మూలస్తంభంగా మారింది. అయితే ఇటీవల మళ్ళా కార్పొరేట్‌ సంస్థలు బలపడి, ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడుతున్న నేపథ్యంలో మత
రాజకీయాలకు ఊతం లభిస్తున్నది. రాజకీయాలలో మతప్రమేయం పెరుగుతున్నందున  అన్ని ఎన్నికలపై ప్రభావం చూపుతుతందనడంలో సందేహం లేదు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయా రాష్ట్రాల లో కులం, మతం పేరిట ప్రచారం సాగే అవకాశాలు లేకుండా నేతలు ముందుకు సాగడం లేదు. దీనికితోడు వ్యక్తిగత దూషణలు పెరిగాయి.  గత రెండు దశాబ్దాలుగా రాజకీయాలలో మత ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ఆయా పార్టీలు అనుసరి స్తున్న వైఖరే ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. మతాన్ని పూర్తిగా మనిషి జీవన విధానంలో లేకుండా నిర్మూలించడం కాదనే స్పష్టత ఉంది. దశాబ్దాలుగా ప్రజా స్వామిక లౌకిక రాజ్యంగా స్థిరపడిన భారత గణతంత్రం కూడా మత రాజకీయాల ఒత్తిడులకు గురవుతున్నది. మత విద్వేష రాజకీయాలను అరికట్టే క్రమంలో కొందరు స్వార్థ నేతల కారణంగా ప్రజస్వామ్య విలువలు పడిపోతున్నాయి. అధికారమే పరమావధిగా రాజకీయ నేతలు పబ్బం గడుపుకునే స్థితికి వచ్చారు. కేవలం పేదరిక నిర్మూలన, కులవ్యవస్థ నిర్మూలన, అణగారిన వర్గాలను పైకి తీసుకుని రావడమన్న భావనలో ప్రచారాలుగా ఉండాలి. వారి కార్యాచరణ కూడా అదే కావాలి. అలా చేస్తేనే భారత దేశం కులమత రహితం గా అభివృద్ది చెందగలదు. లేకుంటే సమాజాంలో అసమనాతలు ఇంకా కొనసాగగలవు. దీనికి రాజకీయ పార్టీలదే ప్రధాన కారణం కాగలదు. ఉన్నత చదువులు చదివి వస్తున్న నేతలు కూడా రాజకీయాల్లోకి రాగానే పంథా మార్చేస్తున్నారు. కేవలం కులం, మతం ఆధారంగా తమ వర్గాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ పోకడలు పోతే తప్ప భారత్‌లో కులరహిత సమాజాం వృద్ద చెందడం అసాధ్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.