కులవృత్తులను గౌరవించిన ఘనత కెసిఆర్‌దే

విపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవు

మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు

జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో కులవృత్తులను గౌరవించి వారికి ఆర్థికతోడ్పాటును అందిస్తూ గౌరవిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అంటేనే అన్ని కులాలు, మతాలను గౌరవించే పార్టీ అని అన్నారు. అందుకే రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కులవృత్తులను గౌరవించలేదని గ్రహించి వారి ఆర్థిక పురోభివృద్దికి తోడ్పాటును అందించారని అన్నారు. గతంలో కాంగ్రెస్‌,టిడిపిలు మాయమాటలు చెప్పి వారితో ఓట్లు వేయించుకున్నాయన్నారు. తెలంగాణలో కులవృత్తులను గుర్తించి వాటిపై ఆధారపడ్డ వారికి జీవనోపాధి కల్పించేందుకు అనేక పథకాలను సిఎం కెసిఆర్‌ ప్రవేశ పెట్టారని అన్నారు. సబ్సిడీపై పనిముట్లను అందజేసి ఉచితంగా శిక్షణను ఇప్పించి వారికి ఉపాధి కోసం కృషి చేసారని అన్నారు. 60ఏండ్ల కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో తెలంగాణలో అభివృద్ధిని నీరుగార్చాయని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడి పోటి చేస్తే నియోజకవర్గలోనే గాకుండా జిల్లాలో కూడా వారి అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవన్నారు.