కూటమికి ఓటేస్తే కాళేశ్వరం ఆగిపోతుంది

మంత్రి హరీష్‌ రావు హెచ్చరిక

కరీంనగర్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి):ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకోలేని మహాకూటమి నాయకులు పాలన ఎలా సాగిస్తారని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కాంగ్రెస్‌ను కోదండరాం.. కోదండరాంను కాంగ్రెస్‌ నాయకులు నమ్మడం లేదన్నారు. కేశవపట్నంలో నిర్వహించిన నియోజకవర్గ సభలో హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా కాంగ్రెస్‌ పార్టీ వింటోందని అన్నారు. పోలవరం కింద మూడో పంటకు నీళ్లు అందవనే ఉద్దేశంతో చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చంద్రబాబు మాటవిని కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేస్తారని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే రైతుబంధు పథకాన్ని రద్దు చేస్తామని .. చివరికి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు కూడా రద్దు చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారని మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్‌ను రద్దు చేయాలని ప్రజలు చూస్తున్నారు. మానకొండూర్‌ను సిద్ధిపేట, హుజురాబాద్‌ నియోజకవర్గాల తరహాలో అభివృద్ధి చేస్తాం. మంత్రి ఈటల రాజేందర్‌, తాను రసమయి బాలకిషన్‌కు అండగా ఉంటామన్నారు. కాళేశ్వరం పూర్తయితే మానకొండూర్‌ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని హరీశ్‌ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పదవికి రాజీనామా చేయని ఆరెపల్లి

మోహన్‌ ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదు. అప్పుడు ఉద్యమాన్ని.. ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గట్టిబుద్ధి చెప్పాలని ప్రజలను హరీశ్‌ రావు కోరారు.