కూటమికి ఓట్లేయడం వల్ల ఒరిగేదీలేదు

– అభివృద్ధి జరగాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం

– కాంగ్రెస్‌ హయాంలో ఇరిగేషన్‌ గురించి పట్టించుకోలేదు

– తెలంగాణ ద్రోహి వైఎస్‌ రాజశేఖరరెడ్డి

– తెరాస హయాంలో వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం

– ఆపద్ధర్మ మంత్రి హరీష్‌రావు

జగిత్యాల, నవంబర్‌15(జ‌నంసాక్షి) : కాంగ్రెసోళ్లకు, టీడీపీ వాళ్లకు ఓట్లు వేసి ప్రజల చేతులు నొప్పులు పుట్టాయని, ఆ రెండు పార్టీల వాళ్ల తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. వేములవాడలో గురువారం ఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, నాడు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ఇరిగేషన్‌ గురించి పట్టించుకోలేదని, వేములవాడ కరువుతో తల్లడిల్లిందని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాకే ఇక్కడి చెరువులు నీళ్లొచ్చాయని, సూరమ్మ చెరువుని చూస్తుంటే తన కడుపు నిండిపోయిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పుణ్యమా అని తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ పెండింగ్‌ ప్రాజెక్టులైపోయాయని, వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరివ్వలేదని, వైఎస్‌ తెలంగాణ ద్రోహి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ హయాంలో కన్నీళ్లు తెపిస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అన్ని వసతులు కల్పించి రైతుల్లో ఆనందం నింపామన్నారు. తెలంగాణలో కరెంట్‌ ఫుల్‌.. నీళ్లు పుష్కలం చేసింది టీఆర్‌ఎస్‌ పార్టీ అని, అందుకే కారు గుర్తుకే ఓటెయ్యాలని హరీష్‌రావు పేర్కొన్నారు. కూటమి నాయకుల మాయమాటలు నమ్మవద్దని కోరారు. అదొక మాయా కూటమి అని, వారితో ప్రజా సంక్షేమం కంటే కష్టాలే ఉంటాయని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో తిరిగి తెరాస ప్రభుత్వం ఏర్పాటు కానుందని ధీమా

వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ బీడు భూములకు గోదావరి నీళ్లు అందుతాయని, రైతులు సుభిక్షంగా ఉంటారని చెప్పారు. కూటమి నేతలు ప్రాజెక్టుల నిర్మాణాలను ఇప్పటికే అడ్డుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్టాన్ని మరోసారి సీమాంధ్ర నాయకులకు అప్పగించడానికి కుట్ర చేస్తున్నారని అన్నారు. వారెన్ని కుట్రలు పన్నినా కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయించడం ఖాయమని చెప్పారు. తెరాస ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను కూటమి నాయకులు రద్దుచేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు ను తొలగిస్తామంటున్నారని, కేవలం రుణమాఫీ చేస్తామంటున్నారని హరీష్‌రావు అన్నారు. తెరాసనే అధికారంలో ఉంటే రైతుబంధు, రైతు బీమాలతో పాటు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ప్రజలంతా ఆలోచించుకోవాలని తెలంగాణ అభివృద్ధి కావాలంటే తెరాసతోనే సాధ్యమవుతుందని అన్నారు.