కూటమిని గెలిపిస్తే.. పాలన చంద్రబాబు చేతుల్లోకి వెళ్లినట్లే

 

మనపాలన మనం పాలించుకోవాలంటే తెరాసతోనే సాధ్యం

– కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరుగుతుంది

– తెరాసకు ఓటేసి కూటమిని తరిమికొట్టండి

– తెరాస ఎంపీ కవిత

జగిత్యాల, నవంబర్‌22(జ‌నంసాక్షి) : మహాకూటమికి ఓటేస్తే ఇన్నాళ్లు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబుకు చేతులకే పాలన పగ్గాలు అప్పగించినట్లవుతుందని తెరాస ఎంపీ కవిత అన్నారు. గురువారం ఆమె కోరుట్ల నియోజకవర్గంలో మల్లాపూర్‌ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు బతుకమ్మలు, బోనాలు, మత్స్యకారుల వలలతో ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ధాటికి తట్టుకోలేకనే టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, కోదండరాం పార్టీలు కూటమి కట్టాయని కవిత విమర్శించారు. అధికారం కోసం అన్ని పార్టీలు సిద్ధాంతాలను వదిలి పెట్టాయని మండిపడ్డారు. నాలుగేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో కేసీఆర్‌ అభివృద్ధిపర్చారన్నారు. దీంతో తమ పార్టీల అడ్రస్సు గల్లంతవుతుందనే భావనతో అంతా కలిసి కేసీఆర్‌ను అడ్డగించేందుకు సిద్దమయ్యారని విమర్శించారు. కూటమి పొరపాటున అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పాలన సాగిస్తారని కవిత అన్నారు. ప్రజలంతా ఆలోచించి పాలన అమరావతి నుండి ఢిల్లీ నుంచి కాకుండా మన పాలన మనదగ్గర నుంచే జరిగేలా చూడాలని కవిత కోరారు. అందుకు విూరు చేయాల్సిందల్లా తెరాసకు ఓటువేసి కూటమికి బుద్ది చెప్పటమేనని అన్నారు. సీఎం కేసీఆర్‌ నిరంతరం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచిస్తారన్నారు. బోళా శంకరుడిలా వరాలు కురిపించడమే అయనకు తెలుసని చెప్పారు. బీడీ కార్మికులు, బోధకాలు బాధితులకు ఎవరూ అడుగకుండానే పెన్షన్‌ మంజూరు చేశారన్నారు. ప్రభుత్వం వచ్చిన తదుపరి మరోసారి ప్రజలకు మేలు చేసేందుకు నిర్ణయాలు సిద్ధం చేశారని తెలిపారు. నాలుగున్నరేండ్లలో 463 పథకాలు ప్రవేశపెట్టి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చిన టీఆర్‌ఎస్‌ను ఆదరించాలని పిలుపునిచ్చారు ఎంపీ కవిత. డిసెంబర్‌ 7న, ప్రజలకు మేలు చేసే పార్టీకి ఓటు వేయాలని కోరారు.