కూటమి కట్టినా కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు
టిఆర్‌ఎస్ గెలుపుతో బుద్ది చెప్పాలి : ఎమ్మెల్సీ
జనగామ,సెప్టెంబర్28(జనంసాక్షి): అరవై ఏళ్లు తెలంగాణ సంపద దోచుకున్న సీమాంద్రోళ్లు తిరిగి తెలంగాణలో ఓట్ల కోసం తిరిగే నైతిక హక్కు లేదని ఎమ్మెల్సీ బి. వెంకటేశ్వర్లు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీ స్థాపిస్తే ఆ పార్టీ ప్రస్తుతం తెలంగాణకు అడ్డుపడ్డ కాంగ్రెస్‌తో జట్టు కట్టడం సిగ్గు చేటన్నారు. ఎన్ని కూటములు ఏర్పడిన విజయం గులాబీ పార్టీదేన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే జనగామ నియోజవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని, టీఆర్‌ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని శాసనమండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. జనగామ నియోజకవర్గంలో అరవై ఏళ్లలో జరగని అభివృద్‌ధ్ది ముత్తిరెడ్డి కేవలం నాలుగేళ్లలో చేశారన్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో దోపిడీకి గురైందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను సరిదిద్దేందుకే రెండేళ్లకు పైగా పట్టిందన్నారు. మిగిలిన రెండేళ్లలో సీఎం ప్రగతిపై దృష్టి సారించారని అన్నారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వం చేసిన పనులు కనిపించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. చెరువులకు నీళ్లు, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, నిండుగా కరెంటు, రైతులకు పంటలకు పెట్టుబడి సాయం రైతు అకాలంగా మరణిస్తే ఆ కుటుంబం వీధీన పడకుండా రూ., 5 లక్షల బీమా వర్తింపు కళ్లకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. రెండేళ్లలో ఇచ్చిన హవిూలతో పాటు ఇవ్వని పనులు, పథకాలు అమలు చేశామని
ఆయన గుర్తు చేశారు. గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి తప్ప ఇతర పార్టీలకు అవకాశం లేదని, ఆ పార్టీకే ఓటు వేస్తామంటూ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కార్యకర్తలు గడపగడపకూ వివరించాలన్నారు.