కూటమి మాటలను నమ్మి..  తెలంగాణను ఆగం చెయ్యొద్దు

– కూటమి గెలిస్తే ఢిల్లీ, ఏపీల నుంచి పాలన
– కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని కాంగ్రెసోళ్లు 200కేసులు వేశారు
– విద్యుత్‌ అడిగితే రైతులను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్‌ది
– నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశాం
– పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషిచేశాం
– అభివృద్ధి కొనసాగాలంటే తెరాసకు దన్నుగా నిలవండి
– ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : తెలంగాణకు అన్యాయం చేసిన టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూటమిగా జట్టుకట్టి ప్రజల ముందుకొస్తున్నాయరి, కూటమి మాటలు నమ్మితే తెలంగాణ మళ్లీ ఆగమైనట్లేనని, ప్రజలు ఆలోచించి కూటమి కుట్రలను తిప్పికొట్టాలని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా నాగంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్‌లో మరలా కేసీఆర్‌ సీఎం అయ్యాక డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. గతంలో విద్యుత్‌ అడిగితే రైతులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌దని, బషీర్‌బాగ్‌లో గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపిన చరిత్ర టీడీపీదని అన్నారు. కానీ మన తెలంగాణ పాలనలో కేసీఆర్‌ విద్యుత్‌ అడకుండానే రైతులకు, ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తే దేశంలోనే చరిత్ర సృష్టించారని అన్నారు. సమస్యను చెబితే దాడులు చేసే కాంగ్రెస్‌, టీడీపీలను తరిమికొట్టి, అడక్కుండానే 24గంటల విద్యుత్‌ను అందించిన కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని కాంగ్రెసోళ్లు కోర్టులో 200 కేసులు వేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌, టీడీపీలతో ప్రజలకు ఒరిగేదేవిూ లేదని స్పష్టం చేశారు. పనిచేసే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులకు నాలుగు రెట్లు ఎక్కువ చేస్తానన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్‌ తో పోటీపడేలా అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఆరు నెలల్లో లక్ష ఎకరాలకు నీళ్లివ్వబోతున్నామని చెప్పారు. ఎగువ మానేరును నీరు నిలిపామని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి బలపర్చాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అన్నారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణలోని అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.