కృష్ణాడెల్టాకు నీరు తక్షణం ఆపండి
హైదరాబాద్, జూలై 6 (జనంసాక్షి): కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై మంత్రి దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలోని ఆయన చాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉండగా కృష్ణా డెల్టాకు నీరు ఎలా విడుదల చేస్తారని ఆయన ప్రశ్నించారు. కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడంతో హైదరాబాద్‌లో మంచి నీటి సమస్య తలెత్తుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్రాంతానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మరో ప్రాంతానికి అన్యాయం చేయవద్దని దానం సూచించారు. తక్షణమే నీటి విడుదలను ఆపాలని ఆయన కోరారు. లేకుంటే హైదరాబాద్ ప్రజలకు తీరని అన్యాయం చేసినట్టు అవుతుందని ఆయన మండిపడ్డారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులలో ఇప్పటికే మంచి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న హైదరాబాద్ ప్రజలపై కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మరో పిడుగు వేసినట్లయిందని ఆయన అన్నారు. ముఖ్యంగా జంటనగరాల శివారు మున్సిపాలిటీలలో కొన్ని చోట్ల వారం రోజులకు కూడా ఒక్క సారి మంచి నీరు వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలన్న నిర్ణయం సరైనదేనని మంత్రి జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సీనియర్ మంత్రి అయిన జానారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు.. కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని, వెంటనే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నీటి విడుదల ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా మెడికల్ సీట్ల వ్యవహారంలో కూడా హైదరాబాద్‌కు అన్యాయం జరిగిందని దానం ఆరోపించారు. నగరంపై ప్రభుత్వం సవతితల్లిప్రేమ చూపిస్తున్నదని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌కు అన్యాయం జరిగితే స్థానిక నేతగా తాను సహించేది లేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌కు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నా ప్రేక్షక పాత్ర పోషించడం సరికాదనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చినట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్‌కు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. మెడికల్‌సీట్ల వ్యవహారంలో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే ప్రాంతాలు, నేతల మధ్య విభేదాలు తలెత్తాయని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వాటిని మరింత రెచ్చగొట్టే విధంగా ఉండవద్దని దానం సూచించారు. దీనిపై మంత్రి కోండ్రు సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. పొరబాట్లు సరిదిద్దకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని మంత్రి దానం అన్నారు.