కృష్ణా డెల్టాకు నీటి విడుదలకై రైతుల ఆందోళన
విజయవాడ, జూలై 28 : కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హనుమాన్ జంక్షన్‌లో శనివారం నాడు రైతులు ఆందోళన చేపట్టారు. రహదారిపై భేఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా టిడిపి అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరి కారణంగా కృష్ణా డెల్టా క్రింద వున్న 30లక్షల మంది రైతుల నష్టపోయే ప్రమాదం పొంచి వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వరి పంట దిగుబడి తగ్గిపోతుందని దీనితో బియ్యానికి కొరత ఏర్పడి ధరలు పెచ్చిమీరిపోతాయని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ తారాతమ్యాలు లేకుండా కృష్ణా డెల్టాకు నీరందించాలని అన్నారు. ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్ళకు లొంగవద్దని దేవినేని కోరారు. స్పందించని పక్షంలో ఆగష్టు 1 నుంచి నిరవధిక ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.