కృష్ణా నదీ జలాలపై సర్కారుది అవగాహనా రాహిత్యం
` ఉత్తమ్‌కుమార్ రెడ్డికి అసలు విషయమే తెలియదు
` చెక్‌డ్యామ్‌లను కూల్చేస్తున్న ఇసుక మాఫియా
` ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం
` దమ్ముంటే సహకార ఎన్నికలు నిర్వహించండి
` నామినేటెడ్ పద్దతిలో భర్తీకి సర్కార్ యత్నం: కేటీఆర్
నల్లగొండ(జనంసాక్షి):కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రుల అజ్ఞానంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నల్లగొండ జిల్లా వేదికగా సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నదీ జలాల అంశంపై ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులపై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నీళ్లపై కనీస అవగాహన లేదని విమర్శించారు. ఇటీవల జరిగిన ఒక విూడియా సమావేశంలో నీళ్ల గురించి అడిగిన ప్రశ్నలకు ’నేను ప్రిపేరయ్యి రాలేదు, రేపు వచ్చి సమాధానం చెప్తా’ అని తప్పించుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మరో మంత్రి గురించి చెబుతూ ’వాటర్‌లో నీళ్లు’ అని మాట్లాడే అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలు, సాగునీటి అవసరాలు తెలియని వాళ్లు అడ్డదారిలో అధికారంలోకి వచ్చి హూంకరిస్తున్నారని, అబద్దాలు చెప్పి గందరగోళం సృష్టించడం తప్ప వారికి ప్రజలపట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ గర్జిస్తుంటే, దానికి సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం అశ్రద్ధ చేస్తోందని ఆరోపించారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేస్తే.. మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తిచేయలేక ఈ రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. డీపీఆర్ (ఆఖఖీ) పంపడంలో విఫలమవడమే కాకుండా, ప్రాజెక్టుల పరిధిని కుదిస్తూ తెలంగాణ ప్రయోజనాలకు గండికొడుతున్నారని విమర్శించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. సాగునీటి అంశంపై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం తడబడుతోందని, ప్రజల దృష్టిని మళ్లించడానికి బెదిరింపులకు దిగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ భయపడదని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
చెక్‌డ్యామ్‌లను కూల్చేస్తున్న ఇసుక మాఫియా
తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు.. పక్కా మాఫియా పాలన అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు విూద బాంబులు వేశారని.. నేడు ఇసుక మాఫియా కోసం ఏకంగా చెక్ డ్యామ్‌ల విూద జెలటిన్ స్టిక్స్‌తో బాంబులు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ ఇది మానవ నిర్మిత విధ్వంసం అని మొత్తుకుంటున్నా, ఈ ’చిట్టి నాయుడి’ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని అన్నారు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్ చేసి, జెలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారని అన్నారు.ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని, కోట్ల రూపాయల ప్రజా ధనంతో కట్టిన చెక్ డ్యామ్‌లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది ప్రభుత్వమా లేక గ్యాంగ్ స్టర్ల అడ్డాయా అని నిలదీశారు. భూగర్భ జలాలు పెరగాలని మేం చెక్ డ్యామ్‌లు కడితే.. వాటిని కూల్చివేసి రైతుల పొలాలను ఎడారిగా మారుస్తున్నారని మండిపడ్డారు. విూ ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం తెలంగాణ రైతాంగం బలి కావాలా అని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కూలిపోయాయని కట్టుకథలు అల్లిన కాంగ్రెస్ మంత్రులకు రాజేంద్ర సింగ్ రిపోర్ట్ చెంపపెట్టు అని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు విూ సమాధానం ఏంటి రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. అభివృద్ధి చేయడం చేతకాదు కానీ, ఉన్న ఆస్తులను కూల్చడంలో విూరు సిద్ధహస్తులని విమర్శించారు. తెలంగాణ ఆస్తులపై బాంబులు వేస్తున్న మాఫియా వెనుక ఉన్న అసలు దొంగలను బయటపెట్టండని డిమాండ్ చేశారు. రాజేంద్ర సింగ్ డిమాండ్ చేసినట్లు పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే ఈ బాంబుల సెగ విూ కుర్చీ దాకా రావడం ఖాయమని హెచ్చరించారు.
దమ్ముంటే సహకార ఎన్నికలు నిర్వహించండి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ’420’ హావిూలను అమలు చేయలేక, ప్రజలకు ముఖం చూపించలేక సహకార ఎన్నికల నిర్వహణ నుంచి తప్పించుకుంటోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ సర్కారు నామినేటెడ్ పద్ధతిలో ’సహకార’ పదవులు నింపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు ఓటేసే అవకాశం ఇస్తే కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయయని అన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను కూడా ప్రభుత్వం భయంతోనే వాయిదా వేస్తోందని విమర్శించారు.నల్లగొండ జిల్లాలో సర్పంచులు, వార్డు మెంబర్‌ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కార్యకర్తలకు దిశానిర్దేశంచేస్తూ.. అర్జునుడు చిలుక కన్నును లక్ష్యంగా చేసుకున్నట్టు.. మన దృష్టి కూడా కాంగ్రెస్ ఇచ్చిన 420 హావిూల అమలుపైనే ఉండాలని కేటీఆర్ సూచించారు. ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడేది లేదని, నల్లగొండ, మహబూబ్‌నగర్ రైతాంగానికి న్యాయం జరిగే వరకు మన పోరాటం ఆగవద్దని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా మంత్రులకు సాగునీటిపై కనీస అవగాహన లేదని, అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ప్రభుత్వానికి లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో జరిగిన సర్పంచులు, వార్డ్ మెంబర్‌ల అభినందన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తిచేస్తే.. మిగిలిన 10 శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం పూర్తిచేయలేదని విమర్శించారు.కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ గర్జిస్తున్నారని, ఆయన గర్జనకు సమాధానం చెప్పలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసుల పేరుతో నిరాధారమైన లీకులు ఇస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజంగానే మేలుచేసి ఉంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేదని, కానీ ఓటమి భయంతో ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. నామినేటెడ్ పద్ధతిపై ఆయన ధ్వజమెత్తారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి భయంతో ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడంలేదని, నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేస్తూ కాలక్షేపం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికలు పెడితే రైతులు తగిన బుద్ధి చెబుతారనే భయం ముఖ్యమంత్రిలో ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయదారులు, కూలీలు ప్రభుత్వంపై తీవ్ర కోపంతో ఉన్నారని, ఆ ప్రభావం ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. రైతుబంధు, కౌలు రైతులకు ఆర్థిక సాయం, రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయల భరోసా వంటి హావిూలను ప్రభుత్వం విస్మరించిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్‌పై నిరాధారమైన కేసుల లీకులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే.. రైతులకు మంచి చేశామన్న నమ్మకం ఉంటే.. సహకార ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు. ఎన్నికల నుంచి కాంగ్రెస్ ఎన్ని రోజులు తప్పించుకున్నా, ప్రజాక్షేత్రంలో ఆ పార్టీని నిలదీయడం ఖాయమని కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపట్ల చిత్తశుద్ధితో ఉంటే వెంటనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ కేవలం కాలక్షేప రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే, కేసుల గురించి వెనుక నుండి లీకులు ఇవ్వడం మానేసి, నేరుగా కెమెరా ముందుకు రావాలని, ఏ కేసు పెడుతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. హోంమంత్రి కూడా ఆయనే కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాలని, శిఖండి రాజకీయాలు చేయడం తగదని విమర్శించారు. ప్రజా ప్రయోజనాలకంటే కేవలం కేసుల చుట్టూనే ప్రభుత్వాన్ని తిప్పుతున్నారని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితోపాటు మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, నాయకులు చెరుకు సుధాకర్, ఒంటెద్దు నరసింహారెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.


