కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రికార్డు

ఐపిఎల్‌లో సరికొత్త రికార్డు
ఐపీఎల్‌ చరిత్రలో ఐదు సీజన్లలో ఐదు వందలకుపైగా పరుగులు 
న్యూఢిల్లీ,మే15(జ‌నం సాక్షి ): ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు. పరుగుల వీరుడు, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఐదు సీజన్లలో ఐదు వందలకుపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ నిలిచాడు. సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్‌లో కోహ్లీ పరుగుల సంఖ్య 514కు చేరింది. ఇంతకుముందు కోహ్లీ నాలుగు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించాడు. గతంలో 2011 (557 పరుగులు), 2013 (634 పరుగులు), 2015 (505 పరుగులు), 2016 (973 పరుగులు) సీజన్లలో కోహ్లీ పరుగుల వరద పారించి 500కు పైగా రన్స్‌ చేశాడు. అలాగే ఈ సీజన్‌కు పూర్తిగా దూరమైన డేవిడ్‌ వార్నర్‌ నాలుగు సార్లు 500కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.   ఐపీఎల్‌ ఐదు సీజన్లలో 500 అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి నిలిచాడు.  ఈ సీజన్‌లోనూ 500 రన్‌ మార్క్‌ దాటి వార్నర్‌ను వెనక్కి నెట్టాడు. ఈ ఇద్దరి తర్వాత రైనా, గేల్‌, గంభీర్‌ మూడేసి సార్లు 500 కన్నా ఎక్కువ పరుగులు చేయగా.. సచిన్‌ రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. కోహ్లి తొలిసారి 2011 సీజన్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఆ సీజన్‌లో 16 మ్యాచుల్లో 557 పరుగులు చేశాడు.  ఈ సీజన్‌లో బెంగళూరు ఆశించిన విజయాలు సాధించకపోయినా.. కోహ్లి మాత్రం టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో 514 పరుగులతో ఐదోస్థానంలో ఉన్నాడు. ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ 582 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. ఇక ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును కూడా కోహ్లి సొంతం చేసుకున్నాడు.