కెవిపిఎస్ జెండా ఆవిష్కరించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి నర్సింహా.

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 11  కోడేరు మండల కేంద్రంలో బస్టాండ్ దగ్గర కులరహిత సమాజం కోసం దళితుల ఆత్మగౌరవం కోసం పౌర హక్కులను కాపాడడం కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భవించిందని వ్యవసాయ కార్మిక సంఘం నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. నరసింహ అన్నారు. కెవిపిఎస్ ఆవిర్భవించి 24 సంవత్సరాలైనా సందర్భంగా కోడేరు మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం బస్టాండ్ కూడలిలో కెవిపిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండు గ్లాసుల పద్ధతిని రూపుమాపిన ఘనత కెవిపిఎస్ కు ఉంది అన్నారు. దళితులకు ఆలయ ప్రవేశం చేయడంలో, ఆత్మగౌరవాన్ని కల్పించడంలో కెవిపిఎస్ ఎనలేని కృషి చేసిందన్నారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతు జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ  ఉమ్మడి రాష్ట్రంలో కుల రహిత సమాజం కోసం దళితుల ఆత్మగౌరవం కోసం కెవిపిఎస్ కృషి చేసిందని సైకిల్ ర్యాలీలు నిర్వహించి దళితులను చైతన్యవంతం చేయడంలో కెవిపిఎస్ కృషి అమోఘమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు కల్వకోలు రాములు, కాకము లక్ష్మయ్య, గ్రామంలోని దళితులు వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.