కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ

అభివృద్దికి కారణం టిఆర్‌ఎస్‌ అంటున్న అభ్యర్థులు

నిజామాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): వరుసగా సర్వేలు సూచిస్తున్న తీరు తెలంగాణలో అభివృద్దికి

నిదర్శనంగా నిలవగా తాజాగా వాణిజ్య సంస్కరణల అమలులో తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలవడం మనందరికి గర్వకారణమని టిఆర్‌ఎస్‌ నేతలు అన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాల విభాగం నిర్దేశించిన అమలు చేసి తెలంగాణ మొదటి స్థానాన్ని ఆక్రమించడం కెసిఆర్‌ పాలనా దక్షతకు నిదర్శనమని ఎమ్మెల్యే బీగాల గణెళిశ్‌ అన్నారు. పెట్టుబడుల ఆకర్శణలో, పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ దూసుకెళ్లడం సామాన్య విషయం కాదన్నారు. బంగారు తెలంగాణ దిశగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన కొనసాగుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదని పేర్కొన్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వ పాలన ఇలాగే కొనసాగితేనే బంగారు తెలంగాణ సాధించడం ఖాయమని ఎమ్మెల్యే ఆశాభావాం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేయడం వల్లే కేసీఆర్‌ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారని పేర్కొన్నారు. అందుకే మరోమారు కెసిఆర్‌ను సిఎంగా గెలిపించాల్సి ఉందన్నారు. జనరంజక పథకాలతో రాష్ట్ర ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని అందుకు పారిశ్రామిక విధానం కూడా తోడ్పడిందని ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. దేశంలోనే నెంబర్‌1 సీఎంగా సర్వేలు వరుసగా తేల్చేస్తున్నాయని అన్నారు. ప్రజలకు సమర్థ పాలన అందించడమే ఇందుకు కారణమన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక తెలంగాణ సాగుతోందన్నారు. అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లేందుకే కేసీఆర్‌ కృషి చేస్తున్నారని.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతున్న కేసీఆర్‌ పాలన కారణంగానే తెలంగాణ ప్రగతి సాధ్యమయ్యిందన్నారు. తిరిగి మళ్లీ టిఆర్‌ఎస్‌ను గెలపించాలని ఆయన ప్రచారంలో చెబుతున్నారు.