కెసిఆర్ కుటుంబమే బంగారమయ్యింది
తెలంగాణ అభిఆవృద్దిని విస్మరించిన టిఆర్‌ఎస్ పాలకులు
మాయమాటలతో ప్రజలను ఇంకా మభ్యపెట్టే యత్నం
మండిపడ్డ మాజీమంత్రి శ్రీధర్ బాబు
మంథని,నవంబర్22(జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత బాగుపడ్డది మాత్రం సిఎం కెసిఆర్ కుటుంబమేనని మంథని కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియానే దయ్యం అని విమర్వించిన ఘనుడు కెసిఆర్ అని అన్నారు. కేసులతో విపక్షాలను బెదరించిన నేతను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. బంగారు తెలంగాణను చేస్తానని గద్దెనెక్కిన కేసీఆర్ మిషన్లు, కవిూషన్ల అక్రమ సంపాదనతో తన కుటుంబాన్నే బంగారుమయం చేసుకున్నారని మాజీ మంత్రి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను విస్మరించిన తెరాసకు ప్రజలు బుద్ధి చెప్పాలని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, అధికారంలోకి రాగానే కేసీఆర్ మాట మార్చారన్నారు. మాయమాటలతో మభ్యపెడుతున్న తెరాస, భాజపా పార్టీలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. అధికారంలో వస్తే పట్టా, పహాణీలు అందజేసి గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సన్నబియ్యం అందజేస్తామన్నారు. ఏక కాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, 57 ఏళ్లు నిండిన భార్య, భర్తలకు రూ.2 వేల పింఛను అందిస్తామన్నారు. కేసీఆర్ అసమర్థ పాలన వల్లే తొమ్మిది నెలల ముందు ఎన్నికలు వచ్చాయని, మళ్లీ గెలిపిస్తే నట్టేటా ముంచుతారని ఆరోపించారు. రైతులకు లక్ష రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని, రైతుబంధు పథకాన్ని ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టారన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరో లక్ష పెంచి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఇదిలావుంటే కెసిఆర్ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహాకూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, అన్ని చోట్లా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామన్నారు. పార్టీలో తిరుగుబాటు అభ్యర్థులు లేరన్నారు. కూటమి తరఫున హుస్నాబాద్‌లో ఒకే ఒక అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డి ఉన్నారని, ఆయన గెలుపు కోసం కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తారన్నారు. మంత్రులు ఓడిపోతారనే ఉద్దేశంతోనే కేసీఆర్ అక్కడే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు అమలు చేయలేదని, వీరిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ వేసిన పైపులైన్ల ద్వారానే గజ్వేల్, సిద్దిపేటకు నీళ్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. పేద ప్రజలకు అండగా ఉండే ఆరోగ్యశ్రీకి రూ.4 వేల కోట్లు బకాయి పడ్డారని, దీంతో వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. అధికార పార్టీలోని నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నా జిల్లా పాలనాధికారులు, ఎస్‌పీలు చర్యలు తీసుకోవడం లేదన్నారు.