కెసిఆర్‌ భోళాశంకరుడు

అభివృద్దికి అడగ్గానే నిధులు

జగిత్యాల అభివృద్దికి 1200కోట్ల నిధులు

డాక్టర్‌ సంజయ్‌ విజయం కోసం ఎంపి కవిత రోడ్‌షో

టిఆర్‌ఎస్‌ గెలుపునకు ప్రజలు ఓటేయాలని పిలుపు

జగిత్యాల,నవంబర్‌21(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ భోలా శంకరుడని.. జగిత్యాల అభివృద్ధికి రూ.1200 కోట్ల నిధులు ఇచ్చారని నిజ.ఆమాబాద్‌ ఎంపి కవిత తెలిపారు. కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాలకు ఏం చేశామంటున్నారని.. ప్రజలు ఆలోచించాలని కోరారు. గత ఎన్నికల్లో ఇదే చివరిసారి అన్నారు.. మళ్లీ అవకాశం అడుగుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు ఓటేసి మళ్లీ కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు. జిల్లాలోని జగిత్యాల మండలం ధరూర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌కు మద్దతుగా ఎంపీ కవిత రోడ్‌ షోలో పాల్గొన్నారు. జగిత్యాల నుండి యువకులు పెద్దఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మంగళ హారతులు, కోలాటాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు. రూరల్‌ మండలంలో నిర్వహించిన రోడ్‌ షోలో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో జగిత్యాల అభ్యర్థి సంజయ్‌ కుమార్‌తో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. అభివృద్ది విషయంలో ఎక్కడా రాజీలేకుండా ప్రభుత్వం పని చేసిందన్నారు.

ప్రజాకూటమికి ప్రజలు బుద్ధి చెప్పాలని, సింగిల్‌గా సింహంలా వచ్చే కేసీఆర్‌కు విూరందరూ అండగా ఉండాలని ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుకున్న కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించాలన్నారు. రెండో విడత రైతుబంధు పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయకుండా కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్‌ నాయకులకు రైతులు ఓట్లు వేయవద్దని కోరారు. తెలంగాణలో వ్యవసాయం రంగంలో పెద్ద ఎత్తున్న మనం ముందుకెళ్తున్నామని, రాబోయే రోజుల్లో రైతులు పండించిన పంటలను డ్వాక్రా గ్రూపు మహిళలకే ఇచ్చి, వాటి నుంచి మంచి వస్తువులను తయారు చేయించి రాష్ట్రమంతటా అమ్మేలా కేసీఆర్‌ ప్రణాళికా రూపొందించబోతున్నామని తెలిపారు. తద్వారా రైతులకు మద్దతు ధర, డ్వాక్రా మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. మహిళలకు రూ. 10లక్షల వరకు రుణాలు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ అన్నివర్గాలకు న్యాయం చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలో వాటిని సమకూర్చేందుకు కేసీఆర్‌ కృషిచేస్తున్నారని ఎంపీ కవిత అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళితులు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేపట్టడానికి ముందుకు వచ్చేవారికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందించేందుకు కేసీఆర్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చారన్నారు. మహిళా భవనాల నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని ఎంపీ కవిత హావిూ ఇచ్చారు. కేసీఆర్‌ బోళాశంకరుడు అని, అందరికీ న్యాయం చేస్తాడని ఎంపీ కవిత అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌ తదితర ఎన్నో పథకాలు మానవీయ కోణంలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అనంతరం పింఛన్ల మొత్తాన్ని పెంచుతామన్నారు. గ్రామాల్లో సంపద సృష్టించేందుకు కులవృత్తులకు ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు.