కెసిఆర్‌ వైఫల్యాలపైనే బిజెపి దృష్టి

ఎదురుదాడితో ముందుకు సాగుతున్న కమలం
ప్రజాసంగ్రామంతో ప్రజలకు చేరువవుతున్న బండి

హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): తెలంగాణలో కమలనాథుల బలం అనూహ్యంగా పెరగడానికి కెసిఆర్‌ వైఫల్యమే ప్రధాన కారణం. తన ఇష్టం వచ్చినట్లుగా ముందుకు సాగుతూ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా, కేవలం తన సొంత నిర్ణయాలతో మభ్యపెట్టే ప్రయత్నాలు మంచివికావని తెలుసుకోలేక పోతున్నారు. చిన్నిచిన్న సమస్యలను కూడా తృణీకరించడం సరికాదు. ఉద్యోగుల బదిలీలు, విఆర్‌ఎలకు పోస్టింగ్‌లు వంటి చిన్న సమస్యలు కూడా పరిష్కరించడం లేదు. వరదలు వస్తే గట్టిగా వారి పక్షాన నిలబడి ఆదుకునే ప్రయత్నాలు సాగడం లేదు. అన్నింటికీ మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు మంచిది కాదు. మోదీ,అమిత్‌షా నేతృత్వంలోని బీజేపీ గతంలో అద్వానీ,వాజ్‌పేయిల ఆధ్వర్యంలో ఉన్న బిజెపికి భిన్నం. తెలంగాణ బిజెపిలో ఇప్పుడు నాయకత్వం కూడా బలంగా ఉంది. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ దూకుడు పెంచి టీఆర్‌ఎస్‌ను తమ ఉచ్చులోకి లాగారు. ప్రజల్లో గూడు కట్టుకుంటున్న అసంతృప్తిని పసిగట్టడంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం విఫలమైంది. అలాగే టిఆర్‌ఎస్‌ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని మచ్చుకు కూడా కనిపించకుండా అంతా తామే
అన్నట్టుగా కెసిఆర్‌, కెటిఆర్‌ వ్యవహారాలు నడుపుతున్నారు. ప్రగతిభవన్‌ ఛాయలకు ఎవరు రాకుండా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపిలకు కూడా పర్మిషన్‌ ఉండాల్సిందే. అధికారం అంతా ఒక కుటుంబం వద్దనే కేంద్రీకృతమై ఉందన్న ఆరోపణలు పెరిగాయి. క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా విూడియాను దూరం పెట్టారు. కేసీఆర్‌ చిన్నపాటి విమర్శను కూడా స్వీకరించలేని స్థితికి చేరుకున్నారు. ఫలితంగా ప్రజల మనోభావాలను కేసీఆర్‌కు తెలియజేయడానికి పార్టీలో కూడా ఎవరూ సాహసించలేని పరిస్థితి ఏర్పడిరది. తెలంగాణ ప్రయోజనాల కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పుకునే కేసీఆర్‌ మొత్తంగా తన కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని గుర్తించి పనిచేస్తున్నారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. యధారాజా తథా ప్రజా అన్నట్లు కేసీఆర్‌ నియంతృత్వానికి అలవాటు పడిన మంత్రులు, శాసన సభ్యులు, ఇతర నాయకులు తమ ఇలాకాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలెట్టారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌ రెడ్డి, ముత్తిరెడ్డిల భూ కబ్జాలు ఇందుకు ఉదాహరణలుగా చూడాలి. ప్రజాస్వామ్యంలో నిరంకుశ విధానాలను ఎవరు అవలంబించినా పతనం తప్పదు. అది గుర్తించకపోతే మనుగడ సాగించడం కూడా అంతే కష్టం. ప్రజల మనసెరిగి ముందుకు సాగితే ఎంతకాలమైనా ప్రజలు ఆదరిస్తారు. అందుకు ఒడిషా సిఎం నవీన్‌ పట్నాయక్‌ ఉదాహరణగా చూడాలి. ఇటీవల తమిళనాడులో కూడా స్టాలిన్‌ ఇదే కోవలో ప్రజలకు చేరువ అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో బిజెపి దూకుడు ప్రదర్శిస్తోంది. పాదయాత్ర ద్వారా బండిసంజయ్‌ ముందుకు వెళుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ, భారతీయ జనతా పార్టీకీ మధ్య నడుస్తున్న వ్యూహప్రతివ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించి, ఆయనను వ్యక్తిగతంగా దుర్భాషలాడు తున్న కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలన్న పట్టుదలతో బీజేపీ అగ్ర నాయకత్వం ఉంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి సారిస్తే..ఆయనను ఎదుర్కొనేందుకు బిజెపి ప్రతివ్యూహాలు పన్నుతోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు బూచిని చూపించి సునాయాసంగా విజయాన్ని అందుకున్న కేసీఆర్‌, ఈ పర్యాయం ప్రధాని మోదీ బూచిని చూపించాలని ప్లాన్‌ వేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు తెలంగాణలో టిఆర్‌ఎస్‌ వర్సెస్‌ బిజెపి అన్న చందంగా రాజకీయాలు మారాయి.