కేంద్రంలో సంకీర్ణం తెలంగాణ ఖాయం

2014 ఎన్నికలు కీలకం : కేసీఆర్‌
వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది బాబే : కడియం
జమ్మికుంట (కరీంనగర్‌), మే 16 (జనంసాక్షి) :
కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన హుజూరాబాద్‌ నియోజకవర్గ కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం 24జిల్లాలుగా విభజిస్తామని అన్నారు. 1956కు ముందున్న తెలంగాణే కావాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పేరుకే జాతీయ పార్టీ కాని సీమాంధ్రుల పెత్తనంలోనే ఉందన్నారు. కడియం తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించాలన్నారు. 20కోట్ల మైనస్‌ బడ్జెట్‌లో ఆంధ్రా ఉండేదని, నెహ్రూను లొంగదీసుకుని తెలంగాణను కలుపుకున్నారని తెలిపారు. ఢిల్లీని శాసించి తెలంగాణ తెచ్చుకోవాల్సినవసరం ఉందన్నారు. వచ్చిన తెలంగాణను జగన్‌, చంద్రబాబు రాత్రికి రాత్రి ఏకమై అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రతిఒక్కరు కూడా కరుడు గట్టిన సైనికుల్లా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 2014 ఎన్నికలకు తెలంగాణకు అత్యంత కీలకమైనవని, ఈ విషయాన్ని ఏ ఒక్కరూ విస్మరించవద్దన్నారు. తెలంగాణ సాధన కోసం వందకుపైగా ఎమ్మెల్యేలు, 15 మందికిపైగా ఎంపీలను గెలిపించి తీరాలన్నారు. కేంద్రంలో ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ కీలకంగా ఉంటుదని తెలిపారు. తెలంగాణ సాధనే ఏకైన డిమాండ్‌తో తాము కేంద్రంలో ఏర్పడబోయే సంకీర్ణానికి మద్దతు తెలుతామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే తమ ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ నాయకుడు కడియం శ్రీహరి మాట్లాడుతూ, వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని చెప్పి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పిన తర్వాత అడ్డుకున్న విషయాన్ని ఎవరూ మర్చిపోలేదన్నారు. డిసెంబర్‌ 9 రాత్రి ప్రకటన వెలువడిన తర్వాత రాత్రికి రాత్రి సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్‌ నేతలతో పాటు ప్రతి ఒక్కరిని ఒక్కటిగా చేసి రాజీనామాల డ్రామా ఆడించింది ఎవరో ప్రజలకు తెలియకపోయినా తనకు తెలుసన్నారు. కేంద్ర ప్రకటన వచ్చిన మరుసటి రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర మంత్రి ఎవరితోని మాట్లాడి అర్ధరాత్రి ప్రకటించారని అన్న సమయంలో నీ బాడీ లాంగ్వేజ్‌, మాట్లాడిన తీరు చూసిన ప్రతి ఒక్కరికి తెలంగాణ వ్యతిరేకి అని తెలిసి పోయిందన్నారు. ఆ తర్వాత కూడా ఎన్నో అంతర్గత సమావేశాల్లో ఈ విషయమై నిలదీసినప్పటికి దాట వేస్తూ వచ్చాడన్నారు. నష్టం జరుగుతుందని చెప్పినా కూడా వినక పోవడం వల్లే విసుగు చెంది పార్టీ మారాలని, తెలంగాణా సాధన టిఆర్‌ఎస్‌ వల్లే సాద్యం అవుతుందని గుర్తించి టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలను బస్సుయాత్రలకు పురమాయించింది బాబు, లగడపాటి, జేసి దివాకర్‌రెడ్డిలేనన్నారు. కవి, గాయకుడు దేశ్‌పతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎలుక తోలును ఏడాది తోమినా రంగు మారదన్న విధంగా చంద్రబాబును ఎన్ని కిలోల సర్ఫ్‌ వేసి రాకినా, తోమినా కూడా సీమాంధ్ర మచ్చల రంగు పోనే పోదన్నారు. తెలంగాణాకు బద్దశత్రువు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనన్నారు. కుట్రల కాంగ్రెస్‌తో మిలాఖత్‌ అయిన బాబు తెలంగాణాకు అడుగడుగునా మోసం చేస్తూనే ఉన్నాడన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.