కేంద్రచట్టానికి ధీటుగాపంజాబ్‌లో నూతన వ్యవసాయ చట్టం

– అసెంబ్లీ ఆమోదం

చండీగఢ్‌,అక్టోబరు 20(జనంసాక్షి): కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి దీటుగా రాష్ట్రంలో కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకురావడానికి సంబంధించిన బిల్లులను ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని రాజీనామా చేయడానికైనా భయపడనని అన్నారు. ”రాజీనామా చేయాల్సి వస్తుందనో, ప్రభుత్వం కూలిపోతుందేమోనన్న భయం నాకు లేదు. రాష్ట్రంలోని రైతులకు ఎలాంటి కష్టం రానివ్వను” అని ఆయన వ్యాఖ్యానించారు. ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌ – పంజాబ్‌) బిల్లు 2020, ద ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆఫ్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ (పంజాబ్‌) బిల్లు 2020, ద ఎసన్షియల్‌ కమోడిటీస్‌ (పంజాబ్‌) బిల్లు 2020లను ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ సభలో ప్రవేశపెట్టారు.కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల ప్రజలకు నష్టం వాటిల్లుతోందని చెబుతూ.. రాష్ట్రంలో కొత్త చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తోంది. అయితే బిల్లుల డ్రాఫ్ట్‌ కాపీలను తమకు అందించలేదంటూ ప్రతిపక్ష ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ భవనంలోనే ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రాత్రంతా అక్కడే పడుకొని నిరసన వ్యక్తం చేశారు.ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. భాజపాకు చిరకాల మిత్ర పక్షం శిరోమణి అకాలీదళ్‌ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది. సెప్టెంబరు 29న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దీనిపై సంతకం చేసిన తర్వాత కూడా పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు చాలా నష్టపోతారని, వ్యవసాయ రంగం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు, ఎన్డీయే లోని కొన్నిపార్టీలు కూడా వ్యతిరేకించాయి.