కేంద్రమంత్రి గడ్కరీతో కాంగ్రెస్‌ ఎంపిల భేటీ

ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని వినతి
న్యూఢిల్లీ,నవంబర్‌26(జనం సాక్షి): కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని, సిఎం కెసిఆర్‌ అణిచివేత చర్యలపై వారు మాట్లాడారు.  మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్‌ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. గడ్కరిని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఈ భేటీ సుమారు అరగంటకుపైగా జరిగినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కారించాలని
గడ్కరికి.. రేవంత్‌ వివరించారని సమాచారం. ఆర్టీసీ సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్రం చూస్తూ ఊరుకోబోదని గడ్కరీ ఇదివరకే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఆర్టీసీలో కేంద్రానికి వాటాలు ఉన్నాయని, ఆర్టీసీ ఇంకా విభజన కాలేదని, కేంద్రం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. అయితే మంగళవారం విధుల్లోకి చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడ కూడా వారిని విధుల్లో తీసుకోలేదు.