కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించుతాం
` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
` భారతదేశాన్ని కాపాడుకోవడానికే పోరు
` దేశాన్ని తాకట్టు పెడుతున్న ప్రధాని మోడీ
` ఇందిరాపార్క్ మహాధర్నాలో సీతారాం ఏచూరి
` ధరణితో భూములను లాక్కునే ప్రయత్నాలు
` కెసిఆర్ తీరుపై మండిపడ్డ కోదండరామ్
` విపక్షాల ఐక్యతతో పోరాడుతామన్న మాధుయాష్కీ
` మహాధర్నా సక్సెస్
హైదరాబాద్,సెప్టెంబరు 22(జనంసాక్షి): హైదరాబాద్: తెలంగాణ విముక్తి కావాలంటే గులాబీ చీడ వదిలించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ ఆటలు ఇక తెలంగాణ గడ్డపై సాగవని హెచ్చరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ నలుగురి చేతుల్లో బందీ అయిందని, వారి నుంచి విముక్తి కోసమే ఈ పోరాటమని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్నా చౌక్ చూస్తుంటే ఆనాడు జేఏసీ పెట్టి కొట్లాడినట్టుందని, పోడు భూముల కోసం రాష్ట్రంలో కొట్లాట మొదలైందన్నారు.హరితహారం ముసుగులో పోడు భూములను గుంజుకుంటున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో దోచుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు, ప్రజా రవాణా సంస్థలు, అన్నీ తెగనమ్ముతున్నారని దుయ్యబట్టారు. అందరం అనుకుంటే కేసీఆర్‌ను గద్దె దించడం పెద్ద పనేం కాదన్న రేవంత్.. ప్రధాని మోదీ జాతి సంపదను పారిశ్రామిక వేత్తలకు పంచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం, దేశం ప్రమాదంలో పడిరదని ఆరోపించారు. ఈనెల 27న భారత్ బంద్ విజయవంతం చేయాలని, తెలంగాణ బంద్ సంపూర్ణంగా జరగాలని పిలుపునిచ్చారు.భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం ఇవాల్టి నుంచి మన ప్రజా ఉద్యమం’ ప్రారంభమవుతుందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మోదీని గ్దదె దించే వరకు పోరాటం చేస్తామన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే నాలుగు స్తంభాలను మోదీ ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో ప్రశ్నించే వారిని నయానో భయానో లొంగ దీసుకుంటున్నారని విమర్శించారు. గోడౌన్స్‌లో ధాన్యం మూలుగుతున్నాయని, కరోనాతో నష్ట పోయిన కుటుంబాలకు రూ. 7,500 ఆర్థిక పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మోదీ విదేశీ పర్యటనల వెనుక హిడెన్ అజెండా ఉందని, అక్కడకు వెళ్లి ఏమి అమ్మెస్తారోనని భయంగా ఉందన్నారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కలిసింది అవకాశవాదం కోసం కాదని, భారత దేశాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతోనని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. తెలంగాణలో ఆరోగ్య సంక్షోభం నెలకొందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ ఆరోపించారు. కొవిడ్ కారణంగా ఎంతో మంది జీవితాలు ఛిన్నా భిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద జరిగిన అఖిలపక్ష ధర్నాలో ఆయన మాట్లాడారు. ఇసుక, భూ దందాలు చేస్తున్నవారి కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని కోదండరాం విమర్శించారు. కేసీఆర్ ఒక్కడే ప్రగతి భవన్‌లో ఉంటే… ప్రతిపక్షాలన్నీ ఇందిరా పార్క్ వద్ద ఉన్నాయన్నారు. తెలంగాణలో ఆరోగ్య సంక్షోభం నెలకొందని చెప్పారు. కొవిడ్ కారణంగా ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన మొదలు పెడుతుంటే.. కేసీఆర్ నల్ల చట్టాలను తెర విూదకు తెస్తున్నారని మండిపడ్డారు. ధరణి చట్టం.. సంపన్నులకు లాభం చేకూర్చేలా ఉందని తెలిపారు. ధరణిలో అప్లికేషన్లు తీసుకొనే వారు కూడా ఎవరో తెలియదని చెప్పారు. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపించలేదని తెలిపారు. మరోవైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా అంతా కలిసి న్యాయ పోరాటం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతకముందు ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలో ఉన్న ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాలు పిలుపిచ్చిన మహాధర్నాను ఇందిరాపార్క్ నుంచి ప్రారంభించారు. ఇందులో కాంగ్రెస్, తెజస, సీపీఎం, సీపీఐ, తెదేపా, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. మహా ధర్నాకు బీఎస్పీ, వైతెపా హాజరుకాలేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ ఎంపి మదుయాష్కీ మాట్లాడుతూ ఇది చారిత్రాత్మక దినమని…దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఒకే వేదిక విూదకు వచ్చాయని అన్నారు. ఇందరాపార్క్ వద్ద జరుగుతున్న అఖిలపక్షం మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. భారత రాజకీయాలకు ఇది ఒక మలుపన్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. మోదీ నియోజక వర్గం వారణాసి గంగానదిలో 100లాది కరోనా శవాలు కొట్టుకు వచ్చా యని… ఇది మోదీ సర్కార్ వైఫల్యాలకు నిదర్శనమన్నారు. కరోనాతో దేశం అల్లకల్లోలం అయితే మోదీకి మాత్రం విదేశీ పర్యటనలు అని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో నవగ్రహాలు అయిన ప్రభుత్వ కంపెనీలను అమ్మకం పెట్టడం దారుణమన్నారు. అంబానీ, అదానిలకు ప్రభుత్వ కంపెనీలు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి టీఆర్‌ఎస్ బీ టీం అని వ్యాఖ్యానించారు. బీజేపీకి, కేసీఆర్ కి హెచ్చరికలు చేస్తున్నాం…అన్ని పార్టీల కలయికతో విూ కోటలు బద్దలు కొడతామని అన్నారు. కమ్యూనిస్ట్‌లతో దూరం పెరగడం తమకు జరిగిన నష్టమని తెలిపారు. వరి వేస్తే ఉరి అని చెప్పే కేసీఆర్ లక్ష కోట్లు పెట్టీ ప్రాజెక్ట్‌లు ఎందుకు కట్టారని ప్రశ్నించారు. తెలంగాణలో 19 పార్టీల పునరేకీకరణ జరిగిందని మధుయాష్కి తెలిపారు. ఇందిరాపార్క్‌లో అఖిలపక్షం మహాధర్నా బుధవారం ఉదయం ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలపక్షం ధర్నాకు దిగింది. మహాధర్నాకు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. మూడు వ్యవసాయ బిల్లులు, పెట్రోల్, డీజిల్.. నిత్యావసరాల ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ, ఉపాధి హావిూ పని దినాలు, కూలి ధరల పెంపు తదితర డిమాండ్లపై ధర్నా చేపట్టాయి. జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు బీజేపీ, టీఆర్‌ఎస్ యేతర పార్టీల మహాధర్నాకు దిగాయి. మహాధర్నాలో తెలంగాణ టీడీపీ అధ్యక్షులు బక్కని నర్సింహులు, మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి,టిజెఎస్ అధ్యక్షులు కోదండరాం , మాజీ ఎంపీ అజీజ్ పాషా, మాజీ ఎంపీ రాజయ్య, టీజేఎస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, సీపీఐ ఎంఎల్ లిబరేషన్, ఎంఎల్ న్యూ డేమోక్రసి, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.