కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించండి
– ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
హైదరాబాద్,నవంబరు 20(జనంసాక్షి):ప్రధాని మోదీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని సీఎం ప్రధానిని కోరారు. భారత ప్రభుత్వం, ఆధీనంలో విభాగాలు, యూపీఎస్‌సీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్‌బీఐ, స్టాఫ్ సెలెక్షన్ వంటి విభాగాల్లో పరీక్షలు హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహిస్తున్నారన్నారు. దీంతో ఆంగ్ల మాధ్యమంలో చదవని, హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులు కేంద్ర నియామకాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అన్ని రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చేలా ప్రాంతీయ భాషల్లోనూ నియామక పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
పీవీ స్మారక స్టాంప్‌కు అనుమతి ఇవ్వండి..
అలాగే రాష్ట్రపతికి రాసిన మరో లేఖలో మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు శత జయంతి ఉత్సవాలు రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. తెలంగాణకు చెందిన ఆయన వివిధ రంగాల్లో తన ప్రతిభను ప్రదర్శించారన్నారు. అనేక ఆర్థిక సంస్కరణలకు ఆధ్యాడిగా నిలిచారని, అలాగే శాస్త్ర సాంకేతిక, మానవ వనరుల విభాగంలోనూ తనదైన ప్రత్యేకను గుర్తింపును సొంతం చేసుకున్నారన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పీవీ స్మారక తలాపా స్టాంప్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని, కేంద్రం ప్రణాళికకు వెంటనే ఆమోదముద్ర వేయాలని కోరారు. అలాగే శీతాకాలం సందర్భంగా దక్షిణాది విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో స్టాంప్‌ను ఆవిష్కరించాలని కోరారు. ఈ మేరకు లేఖను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు కూడా లేఖను పంపారు.