కేఏ పాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కిలారి ఆనంద్‌ పాల్‌ (కెఏ పాల్‌)కు రాష్ట్ర హైకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. సోదరుడు డేవిడ్‌ రాజు హత్యకేసులో అరెస్టైన పాల్‌కు కోర్టు రూ.లక్ష పూచికత్తుతో షరుతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. పాసుపోర్టును పోలీసులకు అప్పగించాలని, ప్రతివారం పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని కోర్టు పాల్‌ను ఆదేశించింది. కాగా, తమ్ముడు డేవిడ్‌ రాజు హత్య జరిగి రెండేళ్లయిన తర్వాత పాల్‌ ఇటీవల పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. డేవిడ్‌ రాజ్‌ రెండేళ్ల క్రితం మహబూబ్‌ నగర్‌ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురయ్యాడు. ఆ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. పాల్‌ తమ్ముడు డేవిడ్‌ రాజు 2010 ఫిబ్రవరిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కూడా చిత్రంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.