కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి భారీ ఊరట!

– ప్రభుత్వానిదే నిజమైన అధికారమని సుప్రీంకోర్టు తీర్పు
– లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కొన్ని పరిమితులుంటాయి
– ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కలిసి పనిచేయాలి
– అన్ని అంశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు
– సూచించిన సుప్రిం కోర్టు
న్యూఢిల్లీ, జులై4(జ‌నం సాక్షి ) : కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి భారీఊరట లభించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌  దేశ రాజధాని ఢిల్లీలో గత మూడేళ్లుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ప్రభుత్వం మధ్య తలెత్తిన అధికారాల వివాదంలో ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం విజయం సాధించింది. లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ జోక్యం పై  కేజ్రీవాల్‌ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెల్లడించింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానిదే నిజమైన అధికారమని తేల్చింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కొన్ని పరిమితులుంటాయని తెలిపింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రభుత్వంతో కలిసి సఖ్యతగా పనిచేయాలని కోర్టు సూచించింది. దీనికి సంబంధించిన తీర్పు ప్రతులను సీజేఐ దీపక్‌ మిశ్రా చదివి వినిపించారు. ‘రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కేంద్ర, రాష్ట్ర సంబంధాల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉండాలి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాలి. ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వం కూడా కేబినెట్‌ నిర్ణయాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు తెలియజేయాలి. అయితే అన్ని అంశాల్లో ఎల్జీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ యాంత్రికంగా వ్యవహరించకూడదు. మంత్రి మండలి నిర్ణయాలను అడ్డుకోకూడదు. ఎల్జీకి స్వతంత్ర అధికారాలు లేవని తెలిపింది. కొన్ని వ్యవహారాల్లో అభిప్రాయభేదాలు వస్తే దాన్ని ఎల్జీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లొచ్చు అని జస్టిస్‌ మిశ్రా అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీకి రాష్ట్ర ¬దా ఇవ్వొద్దని గతంలో చెప్పిన తీర్పును మిశ్రా సమర్థించారు. మరో తీర్పు ప్రతిని జస్టిస్‌ చంద్రచూడ్‌ చదవుతూ.. కేంద్ర మంత్రులు ప్రజలకు జవాబుదారీగా ఉన్నారనే విషయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తెలుసుకోవాలని చెప్పారు. 2015లో ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే కొన్ని రోజులకే అప్పటి ఎల్జీ నజీబ్‌ జంగ్‌తో అధికార వివాదం తలెత్తింది. ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలను జంగ్‌ అడ్డుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత ఎల్జీగా వచ్చిన అనిల్‌ బైజల్‌తోనూ ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై కేజీవ్రాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఈ విధంగా తీర్పు చెప్పింది.