కేరళ ఆందోళనలకు ఆజ్యం 

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం శబరిమలలోమహిళల ప్రవేశం కోసం చేస్తున్న ప్రయత్నం పేరిట అక్కడి లెఫ్ట్‌ ప్రభుత్వం చేస్తున్న యాగీ కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశం కోసం సుప్రీం తీర్పు తరవాత శాంతియుత వాతావరణం కల్పించి, ప్రజల్లో మార్పు తీసుకుని వచ్చేందుకు ఎలాంటి ప్రయత్నం జరగలేదు. సరికదా రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రయత్నాల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నో ఏళ్లగా ఉన్న ఆచారాలను మార్చాల్సి వచ్చినప్పుడు కొంత సంయమనంతో చైన్యం తీసుకుని రావాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా సిఎం పినరయ్‌ విజయ్‌ వ్యవహరిస్తున్న తీరు భక్తుల మనోభావాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. మహిళా కుడ్యం నిర్మించడం వంటి చర్యలు సనాతనవాదులకు సవాల్‌ విసరడం లాంటివే తప్ప మరోటి కాదు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేరళలో ఉద్రిక్తత రాజేసింది.  బీజేపీ, హిందూ సంస్థల కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు.  తిరువనంతపురంలో సచివాలయం బయట బీజేపీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. అధికార సీపీఎం, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగి పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో అక్కడి వాతావరణం రణరంగాన్ని తలపించింది.  రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీపీఎం కార్యాలయాలపై దాడులు జరిగాయి. మలప్పురంలో బీజేపీ కార్యకర్తలు సీఎం విజయన్‌ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కొచ్చి, పట్టనంతిట్టా, తిరువనంతపురం, కొల్లాంలలో భక్తులు అయ్యప్ప చిత్రపటాలు చేతబూని వీధుల వెంట ర్యాలీలు నిర్వహించారు. సుప్రీం తీర్పు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా ఆచార వ్యవహారాల్లో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు సున్నితంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం పాలకులపై ఉంది. తాజాగా బుదవారం చోటుచేసుకున్న ఘటనలు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. శబరిమల ఆలయంలోకి 50 ఏళ్ల లోపు వయస్సున్న ఇద్దరు మహిళలు ప్రవేశించడం వల్ల అపచారం జరిగిందంటూ బుధవారం కొన్ని గంటల పాటు ఆలయం తలుపులు మూసివేసిన పూజారులు శుద్ధి కార్యక్రమం అనంతరం తలుపులు తెరచి భక్తులను అనుమతించారు. కొత్త ఏడాది వేళ.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో శతాబ్దాల సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ  ఇద్దరు మహిళలు ఆలయంలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారనడం కన్నా సవాల్‌ విసిరారనే అనుకోవాలి. కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు(42) బుధవారం వేకువ జామున పోలీసు రక్షణతో అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్న తరవాత జరిగిన ఘటనలు చూస్తుంటే అక్కడ శాంతిభద్రతల పరిస్థితి విషమించేలా ఉన్నాయి. ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారన్న వార్త తెలియగానే కేరళలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ పాటించాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. అన్ని వయసుల మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత ఇద్దరు మహిళలు అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పు మూడు నెలల తరువాత అమలుకు నోచుకున్న ట్లయింది. లింగ సమానత్వం పేరిట కేరళ సర్కార్‌ ప్రోద్బలంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు రాష్ట్రం ఒక చివర నుంచి మరో చివర వరకు మానవహారం ఏర్పాటుచేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. మహిళల ప్రవేశం తరువాత ఆలయ ప్రధాన పూజారి భక్తులందరినీ బయటికి పంపించి, తలుపులు మూసి సుమారు గంట సేపు గర్భగుడిలో సంప్రోక్షణ నిర్వహించారు. ఆ తరువాతే ఆలయ తలుపులు తిరిగి తెరుచుకున్నాయి. పటిష్ట పోలీసు భద్రత నడుమ నల్లటి దుస్తులు, ముఖాలకు
ముసుగులు ధరించి కనకదుర్గ, బిందు బుధవారం వేకువజామున అయ్యప్ప ఆలయంలో అడుగుపెట్టారు. పంబా నుంచి ఆలయం వైపు మెట్లు ఎక్కుతుండగా, లోపల పూజలు చేస్తున్న సమయంలో తమకు ఎలాంటి నిరసనలు కాలేదని, అంతా సవ్యంగానే సాగిందని వారు తెలిపారు. అక్కడ భక్తులు మాత్రమే ఉన్నారని, వారు తమని అడ్డుకోలేదని వెల్లడించారు. దర్శనం ముగిసిన తరువాత పోలీసులు ఆ ఇద్దరిని గుర్తు తెలియని చోటుకు తరలించారు. అంటే ఇదంతా కేరళ సర్కార్‌ కనుసన్నల్లోనే జరిగిందని చెప్పాలి. ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయ మెట్లు ఎక్కుతున్న దృశ్యాల్ని స్థానిక టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో ఈ సంగతి రాష్ట్రమంతా తెలిసిపోయింది. ముఖ్యమంత్రి పి. విజయన్‌ స్పందిస్తూ కొన్ని అడ్డంకుల వల్ల ఇంతకుముందు మహిళలు ఆలయంలోకి ప్రవేశించలేకపోయారు. కానీ ఈ రోజు అలాంటి సమస్యలు లేకపోవడం వల్లే వారు గుడిలోకి వెళ్లగలిగారు. మహిళలు శబరిమల ఆలయంలో అడుగు పెట్టారన్నది నిజం అని వ్యాఖ్యానించారు. దీంతో సిఎం పట్టుదలతో చేయించిన పనే తప్ప మహిళలపై గౌరవంతో చేసిన పనికాదని తెలుసుకోవాలి. అందుకే అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ప్రతిపక్షాలు కాంగ్రెస్‌, బీజేపీ సీఎం విజయన్‌పై మండిపడ్డాయి. ఆలయంలోకి మహిళలు అడుగుపెట్టడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇది సీఎం విజయన్‌ మొండివైఖరిని సూచిస్తోందని కాంగ్రెస్‌ నేత రమేశ్‌ చెన్నితాల అన్నారు. విజయన్‌ ఆదేశాల మేరకు నడుచుకున్న పోలీసులు ఆ ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించారన్నారు. సంప్రోక్షణ కోసం ఆలయాన్ని మూసివేయడం వందశాతం సరైనదేనన్నారు.  కేరళ ప్రభుత్వం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిందని, సీఎం, కమ్యూనిస్టు నాయకులు, వారి భావి తరాలకు అయ్యప్ప ఆగ్రహం తప్పదని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై హెచ్చరించారు. విజయన్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని శబరిమల కర్మ సమితి డిమాండ్‌ చేసింది.మొత్తంగా ఈ వ్యవహారం పట్టుదలకు నిదర్శనంగా నిలిచిందే తప్ప ప్రజల మనసులను గెలిచేలా కనిపించలేదు.