కేరళ సీఎంకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని మోదీ

మోదీ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేసినవిజయన్‌

న్యూఢిల్లీ, జూన్‌22(జ‌నం సాక్షి ) : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. ఒకట్రెండు సార్లు కాదు.. మోదీ అపాయింట్‌మెంట్‌ పినరయి విజయన్‌కు లభించకపోవడం ఇది నాలుగోసారి. కేరళకు రేషన్‌ బియ్యం కేటాయింపుల్లో అసమానతలపై ప్రధాని మోదీతో చర్చించేందుకు అనుమతివ్వాలని సీఎం పినరయి పీఎంవోను కోరారు. మోదీ అపాయింట్‌మెంట్‌ కావాలని అడిగినప్పుడల్లా పీఎంవో వర్గాలు పినరయి విజ్ఞాపనను తిరస్కరిస్తున్నాయి. అవసరమైతే బియ్యం కేటాయింపులపై చర్చించేందుకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ను కలవాలని పినరయికి పీఎంవో వర్గాలు సూచించాయి. దీంతో సీఎం పినరయి విజయన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మార్చి 20న కూడా మోదీ అపాయింట్‌మెంట్‌ పినరయికి లభించలేదు. ఆ సమయంలో బడ్జెట్‌ కేటాయింపులపై మోదీతో చర్చించేందుకు కేరళ సీఎం అపాయింట్‌మెంట్‌ కోరారు.